అధిక వేతనాలకై జర్మనీలో కార్మికుల పోరాటం

- January 24, 2018 , by Maagulf
అధిక వేతనాలకై జర్మనీలో కార్మికుల పోరాటం

బెర్లిన్‌ : అధిక వేతనాలు కోరుతూ జర్మనీలోని కార్మిక సంఘాలు పోరు బాట పట్టాయి. దేశంలోని అత్యంత శక్తివంతమైన ఐజి మెటల్‌ యూనియన్‌ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. దేశంలోని కీలకమైన మెటల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పరిశ్రమలకు చెందిన దాదాపు 39లక్షల మంది కార్మికులకు ఈ యూనియన్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆరు శాతం వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. వోక్స్‌వాగన్‌, బిఎండబ్ల్యు, బోష్‌, సీమెన్స్‌ వంటి కంపెనీలతో సహా పలు కంపెనీలు, సంస్థల్లో సమ్మె హెచ్చరికలతో 6లక్షల మందికి పైగా కార్మికులను సమీకరించారు. కంపెనీ యాజమాన్యాలతో బుధవారం కార్మిక సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించకపోతే వాకౌట్లు, సమ్మె తప్పదని ఐజి మెటల్‌ ఇప్పటికే హెచ్చరించింది. దేనికైనా సన్నద్ధంగా వున్నామని ఐజి మెటల్‌ నాయకుడు జార్జి హాఫ్‌మన్‌ గత వారమే తెలిపారు. ఈ విషయమై దేశంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇంటా బయటా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కార్మికులు చేసే డిమాండ్లు చాలా వ్యయభరితంగా వున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వారు కేవలం రెండు శాతం మాత్రమే పెంచుతామని ప్రతిపాదిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com