దూసుకుపోతున్న ఇండిగో

- January 24, 2018 , by Maagulf
దూసుకుపోతున్న ఇండిగో

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, ఓనర్‌ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ అంచనాలను బీట్‌ చేసింది. డిసెంబర్‌ త్రైమాసిక లాభాల్లో భారీగా ఎగిసింది. ఓ వైపు ఇంధన వ్యయాలు అధికంగా ఉన్నప్పటికీ కంపెనీ బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ఇండిగో, లాభాల్లో 56.4 శాతం పైకి ఎగిసినట్టు స్టాక్‌ ఎక్చేంజ్‌ ఫైలింగ్‌లో ప్రకటించింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఇండిగో కేవలం రూ.651 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. కానీ వీరి అంచనాలను ఇండిగో బీట్‌ చేసింది. కంపెనీ రెవెన్యూలు ఎక్కువగా అ‍త్యధిక ఛార్జీలు, బలమైన రూపాయి, ప్రయాణికుల వృద్ధి నుంచి వచ్చినట్టు వెల్లడించింది. ప్రయాణికుల వృద్ధి 14 శాతం పెరుగగా.. రూపాయి ఏడాది ఏడాదికి 4 శాతం బలపడింది.

ఏడాదిగా ఇండిగో సగటు విమాన ఛార్జీలు కూడా 10 శాతం పెరిగాయి. ఇవన్నీ ఇండిగోకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. మరోవైపు జెట్‌ ఇంధన ధరలు గతేడాదితో పోలిస్తే 12.6 శాతం పెరిగినప్పటికీ, ఆ ప్రభావం కంపెనీ లాభాలపై ఎక్కువగా పడలేదు. రెవెన్యూలు 23.9 శాతం పెరిగి, రూ.6,178 కోట్లగా రికార్డయ్యాయి. అంచనా వేసిన రూ.6,022 కోట్ల ఇవి అత్యధికం. అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించడంతో, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు 5.5 శాతం మేర పైకి ఎగిశాయి. గత 12 నెలలుగా ఈ కంపెనీ స్టాక్‌ 31 శాతంపైగా పెరిగింది. కాగ, అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్‌ విమానయాన సంస్థలకు సాధారణంగా చాలా మంచి కాలమని, ఈ సమయంలోనే సెలవులు ఎక్కువగా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com