బాహుబలి పోస్టర్ విడుదల
- May 04, 2015
, by Maagulf
బాహుబలి మొదటి భాగం సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో రోజుకో ప్రధాన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తానని చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. సోమవారం నాడు ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు. మెడలో నల్ల తాడుకు చిన్నపాటి శివలింగం కట్టుకుని, కుడి భుజం మీద భారీ శివలింగాన్ని మోస్తూ.. కొండ రాళ్ల మీద నుంచి నడిచి వెళ్తున్న ప్రభాస్ నిలువెత్తు పోస్టర్ ను ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా రాజమౌళి విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ సిక్స్ ప్యాక్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎడమ కాలికి గండపెండేరం కూడా ధరించి ఉంటాడు. పంచె కట్టుకుని, నడుకుము వస్త్రం చుట్టుకున్న ప్రభాస్.. శివలింగాన్ని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంటుంది. వెనక బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద జలపాతం ఉరకలెత్తుతూ కనిపిస్తుంది. దీంతో పాటు.. జక్కన్న దీనికి సంబంధించి పాత్రోచిత వివరణను కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన మోసినదెవడు! నరనరమున సత్తువ ఉరకలు వేసిన నరోత్తముడు ఎవడు!