డా. జి. కిరణ్మయి తో ముఖాముఖి

- November 30, 2015 , by Maagulf
డా. జి. కిరణ్మయి తో ముఖాముఖి

              1. దంత సమస్యలు చాలా కామన్‌గా చూస్తున్నాం. ఈ సమస్యలకు ప్రధాన కారణాలేమిటి?

సమస్యలకు సాధారణంగా జంక్ ఫుడ్స్ మరియు చిరుతిళ్ళు, అత్యధికంగా పంచదార కలిగిన పానీయాలను పళ్ళ రసాలను తీసుకోవడం వంటి ఆహార అలవాట్లు, గట్టి కుచ్చులు గల టూత్ బ్రష్ వాడకం వంటి అలవాట్లు కారణమవుతాయి.  దంతాల అరుగుదల, ఇంకా పళ్ళను సీసాలు మొదలైనవాటి మూతలు తీయడానికి ఉపయోగించడం వలన పళ్ళు విరిగిపోవచ్చు.


            2.  నోటి దుర్వాసన అతి సాధారణమైన దంత సమస్య. దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి?

క్రమబద్ధంగా దంత ధావనం చేయడం, పళ్ళ మధ్యన శుభ్రం చేసుకోవడం, మౌత్ వాష్ ను వాడడం, నాలుకను శుభ్రం చేసుకోవడం, పంచదార తక్కువగా ఉన్న పానీయాలను తీసుకోవడమే కాకుండా తరచూ దంత పరీక్షలు చేయించుకోవడం వంటి మౌఖిక శుభ్రతను పాటించడం వలన నోటి దుర్వాసన  సమస్యను నివారించవచ్చు.


3. ఒకప్పుడు ముసలి వయసులోనే దంతాలు ఊడిపోవడం జరిగేది కదా, ఇప్పుడు చిన్న వయసులోనే ఆ సమస్య    ఎందుకు వస్తోంది?

సాధారణంగా చిన్న వయస్సులో చిగుళ్ళ సమస్యలు, దంత శుభ్రత లేకపోవడం వలన వస్తాయి. దీనిని జువేనిల్ పెరియోడాన్టిస్ అంటారు. ఇటువంటి దంత వ్యాధులు  కూడా చిన్న వయస్సులో దంతాలు ఊడిపోవడానికి కారణమవుతాయి.


4. దంత సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం, చిరుతిళ్ళను తినకుండా ఉండడం లేదా తగ్గించడం, ఆరునెలలకు ఒకసారి దంతవైద్యుని వద్దకు వెళ్ళడం, ఇంకా కొంతమందికి ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్టును వాడడం, కొన్ని క్రీములు వాడడం వంటివి కూడా దంత సమస్యలను రాకుండా ఆపుతాయి.


5. పిల్లల్లో వచ్చే దంత సమస్యలెలా వుంటాయి?

పిల్లల్లో ముఖ్యంగా  సీసాతో పాలు తాగడం వలన, తీపి పానీయాలను తాగడం వలన, దంతాల అమరిక సరిగా లేకుండుట వలన, దంత క్షయం, నాలుక బయటపెట్టడం, వేలు చీకడం వంటి అలవాట్ల వలన పళ్ళు పాడవుతాయి.


6. రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ గురించి వివరిస్తారా?

రూట్ కెనాల్ చికిత్స అనేది  దంత క్షయం వలన, పళ్లకు దెబ్బ తగలడం వలన లేదా కొన్ని సార్లు పళ్ళ ఫిల్లింగ్ లు కారడం వలన పాడయిన పళ్లకు చేసే చికిత్స.  దీనిని ప్రాంతీయ మత్తుమందుని  ఇచ్చి, బాక్టీరియాను తొలగించి, ఆ ఖాళీని ఔషదీకృత రబ్బరు వంటి పదార్ధంతో నింపి చేస్తారు.

7. ప్రమాదంలో దంతాల్లో చిన్న చిన్న భాగాలు విరిగిపోతుంటాయి. వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

దంతాలు విరిగి పోవడం అనేది మనం తరచూ వింటూ ఉంటాం. దీనికి చికిత్స విరిగిపోయిన విధానాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు అది క్లాస్ -1 అయినట్లయితే సూదిగా ఉన్న అంచులను అరగదీస్తాం. . క్లాస్ -2 లో కాంపోజిట్ ఫిల్లింగ్ లేదా వేనీర్స్ ను వాడడం ద్వారా,అంటి బయోటిక్ తోబాటు నొప్పి నివారణ ఔషధాలను ఇచ్చి 24 గంటలలో మరల సమీక్షిస్తాం. కొన్ని సార్లు పన్ను కదలడం కనిపించినట్లయితే స్ప్లింటింగ్ ద్వారా దానిని కదలకుండా చేసి అనంతరం, అవసరమైన చికిత్స చేస్తారు. దంత ప్రవేశం (డెంటల్ ఇంట్రుజన్)  వంటి వాటిని మరల వాటంతట అవే వచ్చేలా వదిలేస్తాము.


8. ఎత్తుపళ్ళను సరిదిద్దడానికి, పళ్ళ మధ్య ఖాళీలు తగ్గించడానికి అత్యాధునిక వైద్య చికిత్సలు ఏమేం అందుబాటులో ఉన్నాయి?

స్థానభ్రంశం చెందిన పళ్ళ చికిత్సకు మెటల్ వైర్లను ఉపయోగించడం అనే సంప్రదాయ పధ్ధతి, సౌందర్య చికిత్స కోసమైతే క్లియర్ బ్రేసేస్ ను ఉపయోగించడం వంటి వివిధ రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల, బయటకు అసలు కనబడకుండా ఉండేలా పళ్ళ లోపల వైపు ఉండే లింగ్వల్ బ్రేసేస్ ను ఉపయోగిస్తున్నారు. ఇక వైర్లు, బిగించడం అవసరంలేకుండా  ఇంవిజలింగ్ ఆలైనర్స్ ను ఉపయోగించి, పళ్ళను మూలాలతో సహా వంచి, మెలితిప్పి క్రమంగా కావలసిన స్థానంలోకి తీసుకు రావడం సరికొత్త పధ్ధతి. ఇంకా పరిశోధనలు సాగుతున్న ఇంకొక ఆధునిక పధ్ధతి ఏంటంటే స్మార్ట్ బ్రాకెట్లను, ఎ బ్రేసేస్ లను ఉపయోగించడం ద్వారా ఖర్చును, పేషెంటు అసౌకర్యాన్ని తగ్గించవచ్చు.

 

డా. జి. కిరణ్మయి,

జనరల్ డెంటిస్ట్(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com