ట్రంప్ తాజా నిర్ణయంతో ఇండియన్ ఉద్యోగుల్లో కలవరం

- May 21, 2018 , by Maagulf
ట్రంప్ తాజా నిర్ణయంతో ఇండియన్ ఉద్యోగుల్లో కలవరం

ట్రంప్ నిర్ణయాలతో ప్రవాస భారతీయలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఎక్కడ వీసాలు, నిబంధనల్లో మార్పులు చేస్తారోనన్న టెన్షన్ నెలకొంది. ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ పై ట్రంప్ ఫోకస్ పెట్టడంతో ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సేవల విభాగం జారీ చేసే ఈ ఈఏడీతో ఇక్కడ తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. హెచ్‌1 బీ వీసా కలిగి ఉండి, గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి దాని ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల భార్యలు లేదా భర్తలు ఈఏడీ కింద తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈఏడీ విధానాన్ని రద్దు చేస్తామని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించడంతో ఇలాంటి వారందరిలో కలవరం మొదలైంది. ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీలో పని చేస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో దాదాపు 5 నుంచి 6 శాతం మంది యూరప్‌ దేశాలకు తరలిపోయారు. కంపెనీలు  కూడా ముందు జాగ్రత్తగా ఆఫీసుల్ని కెనడా సహా యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. దీంతో వలసలు కూడా పెరుగుతున్నాయి. అటు ఈఏడీ కింద ఉద్యోగాలు ఐటీ కంపెనీలకు కూడా అవసరంగా మారాయి. వాటిని రద్దు చేస్తే కంపెనీలకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ట్రంప్‌ వలస విధానాల కారణంగా భారత్, చైనా నుంచి వచ్చే నిపుణుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా భారత్‌ నుంచి వచ్చే ఐఐటీ గ్రాడ్యుయేట్ల సంఖ్య మరీ తగ్గింది. 

ఒక ఐటీ ఉద్యోగాలే కాదు అమెరికాలోని ఆపిల్, ఫేసుబుక్, పేపాల్‌ సహా అనేక కంపెనీల హెడ్‌ క్వార్టర్స్‌ కేంద్రమైన శాన్‌ జోస్‌ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే సరిపడ ఉద్యోగులు దొరకడం లేదు. వాణిజ్య కూడళ్ల వద్ద ఉద్యోగులు కావాలన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ వీసా నిబంధనలు కఠినమవడం, ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ పడే కంటే ప్రశాంతంగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారు. ఈఏడీ ద్వారా ఉద్యోగం చేసుకుంటున్న వారిలో 75 శాతం మంది ఐటీ నిపుణులే. వీరిలోనూ 65 శాతం మంది సిలికాన్‌ వ్యాలీ ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. అందువల్లే ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఈఏడీ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫేస్‌బుక్, ఆపిల్‌ కంపెనీల్లోనే దాదాపు 24 వేల మంది ఈఏడీతో పని చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ విధానాన్ని రద్దు చేస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయినా ట్రంప్‌ ప్రభుత్వం దీన్ని రద్దు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com