దుబాయ్ టూర్‌కు పంపిస్తామంటూ మోసం...

- June 06, 2018 , by Maagulf
దుబాయ్ టూర్‌కు పంపిస్తామంటూ మోసం...

హైదరాబాద్ : తక్కువ ధరలో దుబాయ్ టూర్‌కు తీసుకెళ్తామంటూ నమ్మించి.. 66 మంది బృందాన్ని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. అశోక్‌నగర్‌కు చెందిన జె.ప్రతాప్‌రెడ్డి కాంట్రాక్టర్. ఇతనితోపాటు మరో 65 మంది గ్రూప్‌గా ఏర్పడి దుబాయ్ టూర్‌కు వెళ్లాలనుకున్నారు. ఇందుకు గుంటూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ అయిన తన్నీరు శ్యాంకుమార్‌ను సంప్రదించారు. దుబాయ్ వీసా, విమాన టిక్కెట్లు ఇతరాత్ర ఖర్చులు కలుపుకొని చార్జీలు మాట్లాడారు. వీరి ఒప్పందం ప్రకారం రూ. 17 లక్షలు శ్యాంకుమార్, అతని భార్య ఉషా కిరణ్ బ్యాంకు ఖాతాలోకి పంపించారు. అయితే డబ్బులు తీసుకున్న తరువాత శ్యాంకుమార్ మోసం చేయడంతో ప్రతాప్‌రెడ్డి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పక్కా ప్లాన్‌తో మోసం..! విశాఖపట్టణానికి చెందిన గొంటు రాజ్‌కుమార్ అమీర్‌పేట్‌కు వచ్చి నివాసముంటున్నాడు. ఉద్యోగ నిమిత్తం మలేషియాకు వెళ్లి అక్కడ 5 నెలల పాటు ఉన్నా, సరైన ఉద్యో గం దొరుకలేదు. ఈ క్రమంలోనే గుంటూర్‌కు చెందిన శ్యాంకుమార్ అక్కడ పరిచయం కావడంతో ఇద్దరు స్నేహితులుగా మారారు. కొన్నాళ్ల తరువాత రాజ్‌కుమార్ తిరిగి ఢిల్లీకి వచ్చి స్థిరపడి టూరిస్ట్‌లను వివిధ దేశాలకు తీసుకెళ్లే కంపెనీల్లో పనిచేస్తున్నాడు. శ్యాంకుమార్ తిరిగి తన స్వస్థలానికి వచ్చాడు. శ్యాంకుమార్ హైదరాబాద్‌లోను తన టూరిజం వ్యవహారాలను చూసేవాడు. ఈ క్రమంలోనే ప్రతాప్‌రెడ్డి శ్యాంకుమార్‌ను కలిశాడు. అప్పటికే రాజ్‌కుమార్ కూడా ట్రావెల్ వ్యాపారంలో ఉండడంతో, శ్యాంకుమార్ గ్రూప్‌గా దుబాయ్‌కి టూరిస్ట్‌లను తీసికెళ్లే కాంట్రాక్టు విషయం అతని దృష్టికి తీసుకెళ్లాడు. శ్యాంకుమార్ తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ అయిన సొమ్మును రాజ్‌కుమార్ ఖాతాలోకి బదిలీ చేశాడు. దీంతో ఢిల్లీకి చెందిన ఓయాసిస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ నిర్వాహకుడు అజయ్ దొంగ్రాతో 66 మంది దుబాయ్ టూర్ విషయంపై చర్చించారు. ఒక్కొక్కరికి రూ. 40 వేలు ఖర్చవుతుందంటూ అజయ్ చెప్పాడు. దీంతో రాజ్‌కుమార్, శ్యాంకుమార్‌లు కస్టమర్లు సగం డబ్బే ఇచ్చారంటూ కొంత మొత్తాన్ని అజయ్ కంపెనీకి పంపించారు.

ఈ క్రమంలోనే కొంతమందికి టెక్కిట్లు వచ్చాయి, మరికొంతమందికి టిక్కెట్లు రాలేదు. అప్పటికే టూర్‌కు వెళ్లాలనుకునే తేదీ దగ్గర పడుతుంది. మరో పక్క అజయ్ దొంగ్రా కంపెనీ కూడా మిగతా సొమ్మును చెల్లించాలంటూ రాజ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చిం ది. ఒక పథకం ప్రకారం టూర్‌కు వెళ్లాలనుకునే గ్రూప్‌ను మోసం చేయాలనుకున్న రాజ్‌కుమార్ సరైన స్పందన ఇవ్వలేదు. దీంతో కంపెనీకి మొత్తం డబ్బు చెల్లించకపోవడంతో.. అప్పటికే బుక్‌చేసిన టెక్కెట్లను సైతం ఆ సంస్థ రద్దు చేసింది. దీంతో ప్రతాప్‌రెడ్డి బృందం చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా శ్యాంకుమార్, రాజ్‌కుమార్‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరిపి ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com