రంజాన్ శుభాకాంక్షలు...ఉపవాస దీక్షలను విరమించిన ముస్లింలు

రంజాన్ శుభాకాంక్షలు...ఉపవాస దీక్షలను విరమించిన ముస్లింలు

భారత్దేశవ్యాప్తంగా రంజాన్‌ సందర్భంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పవిత్ర పర్వదినం కోసం తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు, ఈద్గాలు ముస్తాబయ్యాయి. నెలరోజుల ఉపవాస దీక్షలను విరమించిను ముస్లింలు... ఇవాళ రంజాన్‌ వేడుకల్ని జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ ఏర్పాట్లు చేశారు.


తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల పరమ పవిత్ర పర్వదినం ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌ సందడి నెలకొంది. శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో.. ఇవాళ రంజాన్‌ జరుపుకుంటున్నారు. నెలవంక కనిపించగానే ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షలను విరమించారు. పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌, సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్‌ మాసం చివరి శుక్రవారం నాడు జంట నగరాల్లోని మసీదులు, ఈద్గాల్లో కోలాహలం నెలకొంది. పెద్దఎత్తున ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పాతబస్తీలోని మక్కా మసీదులో భారీ సంఖ్యలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. 30 రోజుల కఠోర ఉపవాస దీక్షలు నిన్నటితో పూర్తికాగా.. ఇవాళ రంజాన్‌ వేడుకల్ని జరుపుకుంటున్నారు. పండగ సందర్భంగా చార్మినార్‌ పరిసరాలు షాపింగ్‌ రద్దీతో కిటకిటలాడాయి.

రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 5వేల మంది పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. 600 మసీదుల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. 50 మసీదులు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని మసీదుల్లో రంజాన్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఒక్క కేరళలో మాత్రం శుక్రవారమే ఈద్ పండుగను జరుపుకున్నారు.

Back to Top