ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

- June 18, 2018 , by Maagulf
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

వరంగల్: తెలంగాణ మరో కళాకారుడిని కోల్పోయింది. మిమిక్రీ లోకం మూగబోయింది. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేణుమాధవ్ ఇక లేరన్న వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులు, అభిమానులు, మిమిక్రీ కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

డిసెంబర్ 28, 1932న వరంగల్ జిల్లాలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మీ దంపతులకు వేణుమాధవ్ జన్మించారు. 1947లో పదహారేళ్ల వయసులోనే మిమిక్రీ కళారంగంలో వేణుమాధవ్ ప్రవేశించారు. ఆ తర్వాత దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళంలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు. 2001లో నేరెళ్ల వేణుమాధవ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1981లో శ్రీ రాజ - లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు వరించింది.

ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీతో పాటు ఇగ్నో గౌరవ డాక్టరేట్ తో వేణుమాధవ్ ను సత్కరించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలంగాణ రికార్డుల పుస్తకం ఆధ్వర్యంలో నేరెళ్లను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ వేడుక ఆయన 83వ పుట్టిన రోజు సందర్భంగా హన్మకొండలో ఘనంగా జరిపారు. వేణుమాధవ్ పుట్టిన రోజు డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా ఆయన శిష్యులు జరుపుకుంటున్నారు.

1971లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేణుమాధవ్.. ఎమ్మెల్సీగా సేవలందించారు. నేరెళ్ల పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com