ఫుట్‌పాత్ కబ్జా.!
- June 30, 2018
గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపునకు GHMC సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఫుట్ పాత్ ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. ఇందుకోసం సర్వం సిద్ధం చేసుకుంది. బల్దీయా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం, పోలీసులు, రెవెన్యూ, జలమండలి, ట్రాన్స్‌కో శాఖల అధికారుల తో ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌లో ట్రాఫిక్.. ఓ పద్మ వ్యూహమైతే.. ఫుట్‌పాత్ ల మీద ప్రయాణం ఓ ప్రహసనం లాంటింది. వ్యాపారులు ఫుట్ పాత్లను కబ్జా చేయడంతో.. నడిచేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో.. ఫుట్‌పాత్ మాఫియా మరింత రెచ్చిపోయింది.
ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏకంగా అద్దెలకు ఇచ్చి సొమ్ముచేసుకుంటోంది. ఫుట్‌పాత్ కష్టాలపై జీహెచ్ఎంసి అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు కోర్టులు మొట్టికాయలు వేయడంతో.. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లో నిరంతంరం రద్దీగా ఉండే అబిడ్స్, అమీర్ పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడా, కోఠి, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాలలోని ఫుట్‌పాత్ లు ఆక్రమణలకు గురయ్యాయి. పాదచారులు నడవ లేని పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారులతో పాటు కాలనీలకు వెళ్లే ఫుట్‌పాత్ లపై సెక్యూరిటీ గార్డ్ల కోసం గదులు, ఇళ్ళలోకి మెట్లు నిర్మించేశారు.
జరగాల్సిన నష్టం జరిగాక.. ఆలస్యంగా మేల్కొన్నారు జీహెచ్ఎంసి అధికారులు. ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు గురైన తరువాత.. ఇప్పుడు తొలగింపులు చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఆరు టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఫుట్‌పాత్ ఆక్రమణల పై స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. స్ట్రీట్ వెండర్స్ పాలసీ ప్రకారం ఫుట్ పాత్ ఆక్రమణలు మూడు దశల్లో అధికారులు తొలగిస్తారని... GHMC కమిషనర్ తెలిపారు.
ఫుట్ఫాత్ ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధమైంది. అవసరమైన JCB లు ,పనిముట్లు, యంత్రాలను కూడా సమకూర్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 48 ప్రాంతాల్లో 121 కిలోమీటర్ల మేర ఫుట్ పాత్ లపై 5 వేల ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని వారం రోజుల వ్యవధిలోనే తొలగిస్తామంటున్నారు జీహెచ్ఎంసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టర్ విశ్వజిత్.
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను అధికారులు తొలగించడం.. మళ్లీ అవి ఆక్రమణలకు గురికావడం పరిపాటిగా మారింది. అలా కాకుండా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







