పిల్లి - పాలు - భయం

- December 13, 2015 , by Maagulf


రోజురోజుకి బైటపడుతున్న కొత్త మానభంగాల కేసుల గురించి వింటుంటే ఇలా చేయటం తప్పు, ఈ తప్పుకి శిక్ష పడుతుంది అన్న భయం అసలు లేనే లేదు అని తెలుస్తుంది. మన న్యాయవ్యవస్థ మీద బహుమందికి నమ్మకం ఉందో లేదో తెలియదు కాని, ఈ రేపిస్ట్ లకి మటుకు బాగా ఉంది. తాము పట్టుబడిపోయినా ఒరిగే నష్టం ఏమి లేదు కొన్ని రోజులు జైలు కూడు తినటం తప్ప అని వారికి బాగా తెలుసు. ఆ ధైర్యం ఉండబట్టే జనాలు ఎంత గోల పెడుతున్నా, మీడియా ఎన్ని రకాలుగా ఈ కేసులని హైలైట్ చేసినా జరిగే అఘాత్యాలు జరుగుతూనే ఉన్నయి. బాధితురాలి వయసుకి తనపై చేసే అఘాత్యలకి నిమిత్తం లేదు కానీ చట్టం నేరస్తుడికి శిక్ష వేయడానికి వయసు పరిమితి పాటిస్తుంది. ఇది దొంగతనం లాంటి చిన్న నేరమైతే పోనీ బాగుపడటానికి అవకాశం ఇవ్వాలని అనుకొవచ్చు. మానభంగం, పైపెచ్చు పైశాచికత్వం, ఇవి చిన్న నేరాలతో సమానమా?
తెనాలి రామకృష్ణ పిల్లి పాలు కథ అందరికి తెలిసే ఉంటుంది. రోజు పాలు తాగే పిల్లికి పాలంటే భయం పుట్టించాడు రామకృష్ణుడు. ఎలా? వేడి వేడి పాలు పెట్టాడు, అది తాగాబోయి మూతి కాల్చుకుంది. రెండో రోజు మళ్లీ అదే పని చేసాడు. దెబ్బకీ పిల్లికి పాలంటే భయం పట్టుకుంది. పాల గిన్నిని చూస్తే చాలు పారిపోవడం మొదలుపెట్టింది.
ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారేమో...ఒంటరిగా స్త్రీ కనిపిస్తే కామాంధులై పోయే మగపుంగువులకి తన కేసి చూడాలన్నా భయం రావాలి. ఇక ముందుతరాలని ప్రేమతో మలచుకోగలమో లేదో కాని ఇప్పుడున్న తరంలో మటుకు సామ దాన భేదాలు పనికిరావని బాగా అర్ధమైంది. కుక్కకాటుకి చెప్పుదెబ్బ వెయ్యక తప్పదు. ఇప్పటివరకు బైటపడ్డ మానభంగ కేసులలో రుజువు చేయబడ్డ నేరస్తులకి బహిరంగంగా పరాభవం మరియు శిక్ష వేయనిదే మిగితావారికి భయం రాదు. మానభంగం చేస్తే వంటిసుఖం మాట దేవుడెరుగు మగాడు అని అనిపించుకోవడానికి కావాల్సిన అంశాన్నే పోగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ ఆలోచనకే గగ్గుర్పాటు రావాలి. మానసికంగా నపుంసకులైన వీళ్ళని శారీరకంగా కూడా అలా చేస్తేనే దెయ్యం దారికి వస్తుంది . ఈ పని ప్రభుత్వమో, పోలీసులో, చట్టమో చేస్తుంది అని నిరీక్షించి నీరుగారిపోయిన జనాలు నినాదాలు ఆందోళనలు చేయటం మాని నేరస్తులకి ఇలా బుద్ధి చెప్తేకాని మార్పు రాదు.
మానభంగం చేస్తే చట్టం వదిలి పెట్టినా జనాలు వదిలిపెట్టరు అని అలాంటి చెడు ఆలోచన-ఉద్దేశ్యం ఉన్నవాళ్ళకి తెలియాలి, భయం పుట్టాలి, ఆ భయంతో తమ ప్రవర్తన తామే నియంత్రించుకునేలా చేయాలి.

 

--శ్రీమతి నౌడూరి వసంత లక్ష్మి(షార్జా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com