ఆలోచనలో పడ్డ చంద్రన్న
- July 31, 2018
వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశలు పెట్టుకున్న చంద్రబాబు.. ఆదిశగా వేస్తున్న అడుగుల్లో అత్యంత కీలకమైన అడుగు నేడు పడనుంది! సార్వత్రిక ఎన్నికల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ద్వారా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తనకు అనుకూ లంగా వాతావరణాన్ని మార్చుకుంటున్నారు. ప్రధానంగా విపక్షం వైసీపీకి కలిసి వస్తుందని భావించే ప్రతి విషయాన్నీ ఆయన తొక్కి పెడుతున్నారు. లేదా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారిపోతున్నాయి. తాజా పరిస్థితికి వస్తే.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. కానీ, చంద్రబాబు వీటిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1తో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి. అనంతరం పంచాయతీల్లో పాలన గెలిచిన వారికి అప్పగించాలి. ఈ కార్యక్రమం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా 12,850 చోట్ల సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. సర్పంచ్ల పదవీకాలం పూర్తవుతున్నా పంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద దాదాపు నెల రోజులుగా పెండింగ్లో ఉన్నట్టు సమాచారం.
సకాలంలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పది నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించినా కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా టీడీపీ సర్కారు ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపింది. పదవీకాలం ముగిసే సర్పంచులనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించాలా..? లేక ప్రత్యేకాధికారులను నియమించాలా..? లేదంటే సర్పంచ్లు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలా? అనే మూడు రకాల ప్రతిపాదనలతో పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నెల రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీసుకునే రాజకీయ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు పంచాయతీల్లో పాలనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
అయితే ముఖ్యమంత్రి ఎటూ తేల్చకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. ఇక, ఈ అంశాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామస్థాయిలో విపక్ష వైసీపీ పుంజుకుంది. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంచి ఫలితాన్ని ఇస్తోంది. గ్రామ గ్రామాన జగన్ చేసిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఇదే విషయాన్ని నిర్దారిస్తూ.. ఇంటెలిజెన్స్ నివేదికలు చంద్రబాబుకు చేరాయి. మరోపక్క, రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాలేదు. దీనిని కదిపితే.. కంపు! అన్నట్టుగా ఉండడంతో చంద్రబాబు అసలు ఎన్నికలే నిర్వహించకుండా దీనిని కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకుని, ఆ తర్వాత నిర్వహించాలని బాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. సో.. మొత్తానికి రాష్ట్ర పంచాయతీపై చంద్రబాబు లెక్కలు ఇవీ!!
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







