సముద్రగర్భంలో హైస్పీడ్ రైళ్లు ... చైనాలో తొలిసారి

- November 23, 2018 , by Maagulf
సముద్రగర్భంలో హైస్పీడ్ రైళ్లు ... చైనాలో తొలిసారి

బీజింగ్: ఎన్నో అద్భుతాలకు వేదికైన చైనాలో తొలిసారి సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించబోతున్నారు. హైస్పీడ్ రైళ్ల కోసం ఈ టన్నెల్‌ను ఉపయోగించనున్నారు. తూర్పు ప్రావిన్స్ ఝెజియాంగ్‌లోని రెండు నగరాలను ఇది కలపనుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నర ప్రయాణ సమయం.. 30 నిమిషాలకు పరిమితం కానుంది. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ మొత్తం పొడవు 70.92 కిలోమీటర్లు కాగా.. అందులో 16.2 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్నారు. ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్‌బో నగరాన్ని ద్వీప నగరమైన ఝౌషాన్‌తో కలపనుంది.

ఈ మార్గంలో హైస్పీడ్ రైలు గంటకు గరిష్ఠంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో చైనాలో మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గం పొడవు 25 వేల కిలోమీటర్లకు చేరింది. ప్రపచంలోని మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గంలో 60 శాతం చైనాలోనే ఉండటం విశేషం. చైనాలోనూ ఈ ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోనే తొలిసారి హైస్పీడ్ రైలు మార్గాన్ని లాంచ్ చేశారు. చైనా అభివృద్ధిలో ఈ హైస్పీడ్ రైళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బీజింగ్-షాంఘైలాంటి రూట్లలో గంటలకు గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్లు ఉండటం విశేషం.

ఇండియాలోనూ ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ రైలు కోసం సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com