వలస కార్మికుల కష్టాలు
- December 26, 2015
ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే పొట్ట చేతపట్టుకుని పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్లేది ఎక్కువ భారతీయులే. నాలుగు పైసలు సంపాదించి కుటుంబాల్లో వెలుగులు నింపాలని భావిస్తూ వలసబాట పట్టిన భారతీయులు పరాయి దేశంలో పీడనకు గురవుతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల కేరళకు చెందిన ముగ్గురు ఎలక్ట్రీషియన్లు ఓ ఏజెంట్‌ను ఆశ్రయించి యెమన్‌లో తమకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా కోరారు. అయితే ఏజెంట్ మాత్రం వారిని సౌదీకి పంపించాడు. అక్కడ ఓ ఇటుకల తయారీ కేంద్రంలో పనికి కుదిర్చాడు. దీంతో వారు పనిచేసేందుకు నిరాకరించారు. ఆగ్రహంతో ఊగిపోయిన యజమాని వారిని కర్రతో చితకబాదాడు. అలాగే చిత్రహింసలకు గురిచేస్తున్న యజమాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన తమిళనాడుకు చెందిన ఓ మహిళ చేతిని ఓ యజమాని తెగనరికేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన అక్టోబరులో జరిగింది. 2022లో ఖతర్‌లో నిర్వహించనున్న పిఫా వరల్డ్‌కప్‌కు సంబంధించిన స్టేడియం, ఇతర పనుల నిర్మాణ పనుల్లో ఉన్న ఓ భారత కార్మికుడిని సౌదీ సూపర్ వైజర్ చితకబాదిన దృశ్యాలు ఈ సెప్టెంబరులో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులు అత్యంత దయనీయ స్థితిలో అతి తక్కువ జీతానికి అదనపు గంటలు పనిచేస్తూ దుర్భర జీవితాలు అనుభవిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గల్ఫ్ దేశాల్లో పీడనకు గురవుతూ నానా అగచాట్లు పడుతున్న భారతీయులకు సంబంధించి 2015లో ఇప్పటి వరకు 7,400 ఫిర్యాదులు వచ్చినట్టు విదేశీ వ్యవహారాలశాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ఇటీవల పార్లమెంట్‌కు తెలిపారు. పశ్చిమాసియాలో 60 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. యూఏఈలో 20.8 లక్షలు, సౌదీ అరేబియాలో 10.8 లక్షల మంది ఉన్నట్టు సమాచారం. ఖతర్, కువైట్, ఒమన్ తదితర దేశాల్లో ఐదు లక్షల మంది చొప్పున ఉన్నారు. వీరిలో దాదాపు 6 లక్షల మంది బాధితులుగా ఉన్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా. నిజానికి వీరంతా విదేశాల్లో అగచాట్లు పడడానికి ముందు భారత్‌లో బాధితులుగా మారుతున్నారు. మొదట ఏజెంట్ల చేతిలో ఆ తర్వాత పరాయి గడ్డపై యజమానుల చేతిలో హింసకు గురవుతున్నారు. ఇటువంటి ఘటనలపై తరచూ వార్తలు వస్తున్నా, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా రిక్రూట్‌మెంట్లు మాత్రం ఆగడం లేదు. తమ జీవితాలను బంగారుమయం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఇంకా ఏజెంట్లను ఆశ్రయిస్తూనే ఉన్నారు. దేశాభివృద్ధిలో వారు సైతం పొట్టచేతపట్టుకుని భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయ కార్మకులను నిజానికి అసలైన ఎన్ఆర్ఐలుగా చెప్పుకోవచ్చు. గతేడాది అమెరికాలోని ఎన్ఆర్ఐల నుంచి మన దేశానికి దాదాపు రూ.66 వేలకోట్ల రూపాయలు రాగా, గల్ఫ్ దేశాల నుంచి రూ. 2 లక్షల కోట్ల రూపాయలు భారత్‌కు వచ్చాయి. దీనిని బట్టి అసలు సిసలైన ఎన్ఆర్ఐలు ఎవరో అర్థం చేసుకోవచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో పరాయి దేశాల్లో కష్టాలు అనుభవిస్తూ మాతృదేశ అభ్యున్నతికి పాటుపడుతున్న వీరి వల్ల దేశం ప్రగతి పథంలో సాగుతుందని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







