వస్త్రరంగంలో ఉద్యోగావకాశాలు.. వార్షిక వేతనం రూ.8 లక్షలు

- February 25, 2019 , by Maagulf
వస్త్రరంగంలో ఉద్యోగావకాశాలు.. వార్షిక వేతనం రూ.8 లక్షలు

ట్రెండ్‌ మారితే ఫ్రెండ్ మారడేమో కానీ నేటి యువత ఆలోచనలు మారుతున్నాయి. ట్రెండ్‌కి అనుగుణంగా వారి ఆహార్యాన్ని మార్చుకుంటున్నారు. వస్త్రధారణ నుంచి హెయిర్‌స్టైల్ వరకు అన్నింటా తమదైన మార్కును వేసుకుంటున్నారు. అవే కొత్త కొలువులను తెచ్చిపెడుతూ ఉద్యోగావకాశాలను చూపిస్తున్నాయి. మార్పు మంచికేనేమో మరి కొంత మందికి ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి మరి.
 
నిరంతరం కొత్తదనం వైపు అడుగులు వేస్తున్న వస్త్రరంగం కొలువుల తరంగంగా మారుతోంది. టెక్స్‌టైల్ టెక్నాలజీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు మొదలు.. సంప్రదాయ చేతి వృత్తిగా భావిస్తున్న చేనేతల వరకు లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం 2022 నాటికి వస్త్ర రంగంలో అందుబాటులో ఉన్న కొలువుల సంఖ్య 17 మిలియన్లు. ఈ నేపథ్యంలో టెక్స్‌టైల్‌ రంగంలోని కొలువులను గురించిన విశ్లేషణాత్మక సమాచారం..

అధికారిక లెక్కల ప్రకారం టెక్స్‌టైల్ రంగం ప్రంపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. వ్యవసాయం తరువాత ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగం ఇది. కాబట్టి ఈ రంగానికి సంబంధించిన నైపుణ్యాలు సొంతం చేసుకుంటే కొలువులు ఖాయం.

టెక్స్‌టైల్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ కెమికల్ ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారితో పాటు సంబంధిత నైపుణ్యాలున్న చేనేతల వరకు ప్రతిఒక్కరికీ అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం టెక్స్‌టైల్, గార్మెంట్ పరిశ్రమలు టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. హ్యాండ్లూమ్ బదులు పవర్‌లూమ్ విధానాన్ని అవలంభిస్తున్నాయి.

సంప్రదాయ చేనేతలకు ఆధునిక హంగులు అద్ది వాటిలో నైపుణ్యాలు కనబరిచే దిశగా అవగాహన కల్పించేందుకు .. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎఎన్ఎస్‌డీసీ) అండగా నిలుస్తోంది. టెక్స్‌టైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ పేరుతో ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు నెలకొల్పింది.

రెండు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో ఉండే ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే టెక్స్‌టైల్ పరిశ్రమల్లో పవర్‌లూమ్ వీవర్స్‌గా నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వేతనం ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఈ రంగంలోని ప్రైవేట్ పరిశ్రమలు సైతం ప్రభుత్వ విభాగాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నాయి. ఈ విధంగా 2020 నాటికి మొత్తం పది లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది.

ప్రస్తుతం గార్మెంట్ రంగంలో విస్తరిస్తున్న ఆధునిక టెక్నాలజీ వినియోగం కారణంగా టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు భారీ డిమాండ్ నెలకొంది. రా మెటీరియల్ సేకరణ, కెమికల్ ప్రాసెసింగ్, డిజైనింగ్ తదితర విభాగాల నుంచి టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ కెమికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తి చేసుకున్న వారి కోసం కంపెనీలు, క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ రంగంలో 40 శాతం మేరకు టెక్నికల్ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు ఉండడంతో.. ఆ స్కిల్స్ ఉన్నవారు రూ.40 నుంచి రూ.50 వేల వరకు వేతనం లభిస్తోంది.

ఇక ట్రెండ్‌కి అనుగుణంగా కొత్తగా డిజైన్ చేసే వారికి కంపెనీలు పిలిచి అవకాశాలు ఇస్తాయి. దాంతో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో డిజైన్ స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. నిప్ట్, ఎన్‌ఐడీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో టాప్ కంపెనీలు క్యాపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తూ డిజైన్ ఇంజనీర్స్‌కు కొలువులు అందిస్తున్నాయి. నైపుణ్యాలుంటే ప్రారంభంలోనే రూ.పది లక్షల వరకు వార్షిక వేతనం అందించేందుకు సంస్థలు ముందుంటున్నాయి.

అన్నింటా ప్రవేశిస్తున్న ఆటోమేషన్ టెక్స్‌టైల్ రంగంలోనూ ప్రవేశించింది. ఫలితంగా 3డి గార్మెంట్ డిజైన్ ఇంజనీర్స్, రోబోటిక్ హ్యాండ్లింగ్ డివైజ్ ఎక్స్‌పర్ట్స్, ఆటోమేటిక్ ఫోల్డింగ్ మెషీన్స్ ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలు లభించనున్నాయి.

టెక్స్‌టైల్ కోర్సులను అందిస్తున్న పలు ఇనిస్టిట్యూట్‌లు..
ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ- ముంబై
ఐఐటీ- ఢిల్లీ
బెనారస్ హిందూ యూనివర్సిటీ
ఎన్‌ఐటీ- జలంధర్
యూనివర్సిటీ ఆఫ్ ముంబై
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ
యూపీ టెక్స్‌టైల్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్- కాన్పూర్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ జ్యూట్ టెక్నాలజీ- కోల్‌కత
ప్రస్తుతం టెక్స్‌టైల్ రంగంలో అవకాశాలు విస్తృతంగా ఉంటున్నాయి. ఈ కొలువులను సొంతం చేసుకోవాలంటే వ్యక్తిగత ఆసక్తితో పాటు లేటెస్ట్ లైఫ్ స్టయిల్స్‌ను నిరంతరం గమనిస్తూ ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com