500వ వన్డే విజయ శిఖరాన కోహ్లీ సేన
- March 06, 2019
అప్రతిహత విజయాలతో దూసుకెళుతోన్న కోహ్లీ సేన మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వన్డేలలో 500వ విజయాన్ని సాధించడం ద్వారా క్రికెట్ చరిత్రలో ఇప్పటి దాకా ఆస్ట్రేలియాకు మాత్రమే సొంతమైన రికార్డులో భారత జట్టు పేరునూ కెప్టెన్ కోహ్లీ సేన చేర్చింది.
నాగపూర్ లోని విదర్భ క్రికెట్ స్టేడియంలోని వేలాది అభిమానుల కేరింతల మధ్య ఈ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా 924 మ్యాచ్ లలో 558 విజయాలతో అగ్రస్థానంలో వుంటే…మన జట్టు 963వ మ్యాచ్ లో 500వ విజయాన్ని సాధించి, ఎలైట్ క్లబ్ లో ఆస్ట్రేలియా సరసన నిలిచింది.భారత జట్టు మొట్టమొదటి విజయం1975లో నమోదు చేస్తే…100వ విజయానికి 18 ఏళ్లు,200,300వ విజయాలకు ఏడేళ్లు చొప్పున,400వ విజయానికి మరో అయిదేళ్ల సమయం అవసరమైంది.అక్కడి నుంచి తదుపరి 100 విజయాలకు మళ్లీ ఏడేళ్లు పట్టింది. కేవలం ఐదేళ్ళలోనే భారత జట్టు 300 నుంచి 400వ విజయం సాధించడం వెనుక మహేంద్ర సింగ్ ధోనీ అసమాన ప్రతిభే కారణంగా చెప్పవచ్చు.
1974లో ఆరంగేట్రం:
ఇంగ్లండ్ తో 1974 జులై 13న వన్డేల్లో ఆరంగేట్రం చేసిన భారత జట్టు మరుసటి ఏడాది మొట్టమొదటి వన్డే విజయం చవిచూసింది. మొదటి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ లో తూర్పు ఆఫ్రికాతో జూన్ 11న జరిగిన మ్యాచ్ లో భారత జట్టు వెంకట రాఘవన్ సారధ్యంలో తలపడి, ఏకంగా పది వికెట్ల తేడాతో అదిరిపోయే విజయం సాధించింది.అప్పటి వరకు ప్రత్యర్థి జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించిన చరిత్ర ఏ జట్టుకూ లేదు. ఆ రికార్డును అలనాటి టీమిండియా అలా నెలకొల్పడం విశేషం.అక్కడి నుంచి పడుతూ లేస్తూ…విదేశాలలో విజయాలు సాధించలేక నాటి జట్లు వెనుక పడిపోయాయి. ఆ కారణంగా 100వ విజయం సాధించడానికి18 ఏళ్లు పట్టింది. 1993 లో దక్షిణాఫ్రికాతో మొహాలీలో మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వంలో 100వ విజయం, 2000 సంవత్సరంలో గంగూలీ నేతృత్వంలో కెన్యాపై నైరోబిలో 200వ విజయం, 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో కటక్ లో వెస్టిండీస్ పై 300వ విజయం దక్కాయి. ఇక మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని జట్టు 2012లో కొలంబోలో శ్రీలంకపై 400వ వన్డేను గెలుచుకుంది. ఆ మ్యాచ్ లో ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ సెంచరీ(128 పరుగులు)తో కదం తొక్కి, జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.ఇక ప్రస్తుతానికి వస్తే…. నాగపూర్ విదర్భ స్టేడియం 500వ చారిత్రిక వన్డే విజయానికి వేదికైంది.400వ విజయంలో మాదిరే ఈ మ్యాచ్ లోనూ కోహ్లీ సెంచరీ కొట్టి, జట్టును విజయపథంలో నడిపాడు.
ఇదే మ్యాచ్ లో వన్డేలలో 40వ సెంచరీతో పాటు తక్కువ ఇన్నింగ్స్ లలో 9000 అంతర్జాతీయ పరుగులు చేసిన కెప్టెన్ గా, వన్డేలలో 1000 బౌండరీల రికార్డులనూ విరాట్ కోహ్లీ నమోదు చేసి…500 విజయంపై చెరగని ముద్ర వేశాడు. అయితే జట్టు విజయపరంపరలో మాజీ కెప్టెన్, ప్రస్తుత జట్టు సభ్యుడు-మార్గదర్శకుడు మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి వుంటుంది. ఆ మాటకొస్తే ప్రపంచంలో మరే క్రికెటర్ కూ సాధ్యం కాని రీతిలో భారతజట్టు 300, 400,500ల విజయాలలో ధోనీ భాగస్వామిగా నిలిచాడు. అలా ఓ అనూహ్యమైన,అరుదైన రికార్డును ధోనీ తన పేరిట లిఖించుకున్నాడు. కాగా మూడో వన్డే రాంచీలో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమౌతుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







