ఆస్ట్రేలియాలో డాక్టర్‌ ప్రీతీ రెడ్డి హత్య

- March 06, 2019 , by Maagulf
ఆస్ట్రేలియాలో డాక్టర్‌ ప్రీతీ రెడ్డి హత్య

హైదరాబాద్‌ : ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన డాక్టర్‌ ప్రీతీ రెడ్డి హత్యకు గురైంది. డెంటిస్టును ఆమె మాజీ ప్రియుడే చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రీతీ రెడ్డి(32) డెంటిస్ట్‌ డాక్టర్‌గా సిడ్నీలోని గ్లేన్‌బ్రూక్‌ డెంటల్‌ ఆస్పత్రిలో పని చేస్తోంది. అయితే ఆదివారం రాత్రి ఓ కార్యక్రమం నిమిత్తం ఆమె బయటకు వెళ్లింది. అదే రోజు రాత్రి 2:15 గంటల సమయంలో సెంట్రల్‌ సిడ్నీలోని మెక్‌డొనాల్డ్స్‌ వద్ద ప్రీతీ రెడ్డి ఒంటరిగా ఉన్నట్లు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదు కాగా, మార్కెట్‌ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో ఆమె.. ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక చివరిసారిగా రెడ్డి తన కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం 11 గంటలకు ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేదు. ప్రీతీరెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో కింగ్స్‌ఫోర్డ్‌ ఏరియాలో పార్కు చేసిన కారులో ప్రీతీరెడ్డి మృతదేహం లభ్యమైంది.

ఆమె శరీరంపై అనేక గాయాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే హోటల్‌లో తన మాజీ ప్రియుడు హర్షవర్ధన్‌ నార్దేతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. అతనే ప్రీతీని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హర్షవర్ధన్‌ న్యూ ఇంగ్లండ్‌ హైవేపై కారు ప్రమాదంలో మృతి చెందాడు.

మొత్తానికి ప్రీతీరెడ్డి హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతీ రెడ్డి మృతి పట్ల గ్లేన్‌బ్రూక్‌ డెంటల్‌ సర్జరీ స్టాఫ్‌ నివాళులర్పించింది. ప్రేమను తిరస్కరించినందుకేనా? అయితే ప్రీతీ రెడ్డి, హర్షవర్ధన్ ప్రేమికులు. అయితే కొన్నేళ్ల క్రితం హర్షవర్ధన్ కు ప్రీతీరెడ్డి బ్రేకప్ చెప్పింది.

తనను పెళ్లి చేసుకోవాలని హర్షవర్ధన్ ప్రీతీరెడ్డిని కోరినప్పటికీ ఆమె తిరస్కరించింది. మొత్తానికి ప్రీతీరెడ్డిని హర్షవర్ధన్ హత్య చేశాడు. ఈ హత్య అనంతరం తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్న హర్షవర్ధన్.. తన బీఎండబ్ల్యూ కారును ట్రక్కుకు ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com