అక్కడ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేయడమే..!

- March 29, 2019 , by Maagulf
అక్కడ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేయడమే..!

ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. షరియా చట్టాల ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇటువంటి శిక్షలు వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అదే విధంగా దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్ష వచ్చే బుధవారం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటిసారి దొంగతనానికి పాల్పడితే కుడిచేతిని, రెండోసారి కూడా అదే తప్పు పునరావృతం చేస్తే ఎడమ పాదాన్ని నరికివేస్తారు. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు.

కాగా ప్రభుత్వ నిర్ణయం హక్కులను ఉల్లంఘించేలా ఉందని మానవ హక్కుల సంస్థలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ విఙ్ఞప్తి చేసింది. ఇక ఈ విషయం గురించి హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సభ్యులు ఫిల్‌ రాబర్ట్‌సన్‌ మాట్లాడుతూ..'ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి బ్రూనేను బహిష్కరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆగ్నేయ ఆసియా దేశంలో ఇటువంటి శిక్షలు అమలు చేసే తొలి దేశంగా గుర్తింపు పొందడం ద్వారా వివాదాస్పద దేశంగా బ్రూనై ముద్రపడుతుంది. తద్వారా విదేశీ పెట్టుబడులు, పర్యాటకుల సంఖ్య తగ్గి భారీగా ఆదాయం నష్టపోవాల్సి ఉంటుంది' అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక తమ విధానం గురించి బ్రూనై మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ' 2013 నుంచి అనైతిక చర్యలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేసే విషయమై.....లోతుగా చర్చించాం. ప్రస్తుతం వీటిని అమల్లోకి తేవాలని భావిస్తున్నాం. ఈ విషయం గురించి మా మంత్రి సుల్తాన్‌ హసనాల్‌ బోల్కా ఏప్రిల్‌ 3న అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది'అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com