లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రివ్యూ

- March 29, 2019 , by Maagulf
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రివ్యూ

నటీనటులు: పి. విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీ తేజ్ తదితరులు

సంగీతం : కళ్యాణి మాలిక్

గేయ రచయిత : సిరాశ్రీ

ఫోటోగ్రఫి: రమ్మీ

నిర్మాతలు: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు

తెలుగు సినిమా చరిత్రను మార్చిన వ్యక్తుల్లో వర్మ ఒకరు. శివ సినిమాకు ముందు తరువాత అనే విధంగా శివను తెరకెక్కించాడు. ఆ తరువాత అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన వర్మ, మధ్యలో ఎవరికి అర్ధంగాని సినిమాలు తీసినా... ఆగ్, ఆఫీసర్ వంటి భారీ ప్లాప్స్ పలకరించినా.. వర్మ పాపులారిటీ మాత్రం తగ్గలేదు. వర్మ సినిమా వస్తుంది అంటే.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కారణం ఏంటి అంటే మేకింగ్. అందుకే వర్మ సినీ ఇండస్ట్రీలో ఇంకా నిలబడ్డారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక జరిగిన సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. సినిమా అనుకున్నప్పుడే వివాదం కావడంతో, కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ కాలేదు. తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దామా.

కథ:

1989 వ సంవత్సరంలో ఎన్టీఆర్ అధికారం కోల్పోయాక ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ఆయన జీవిత చరిత్రను రాసేందుకు లక్ష్మి పార్వతి వస్తుంది. లక్ష్మి పార్వతి గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ తన జీవిత చరిత్రను రాసేందుకు అనుమతి ఇస్తాడు. ఎక్కువగా ఎన్టీఆర్ దగ్గరే ఉండి ఆయన జీవిత చరిత్రను రాస్తున్న లక్ష్మిపార్వతిపై దుష్ప్రచారం మొదలవుతుంది. ఈ విషయాల గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ ఆలోచనలో పడతాడు. అలా మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్ సమయంలో ఎన్టీఆర్.. లక్ష్మి పార్వతిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటిస్తారు. దీనిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. ఎన్టీఆర్ అల్లుడు, ఓ పత్రికాధిపతితో కలిసి లక్ష్మి పార్వతిని నెగెటివ్ గా చూపించే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో 1994 ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ లక్ష్మి పార్వతితో కలిసి ప్రచారం చేస్తారు. ఎన్టీఆర్ భారీ మెజారిటీతో గెలిచి తిరిగి అధికారం చేపడతారు. ఆ తరువాత ఆ కుటుంబంలో అనేక మార్పులు జరుగుతాయి. ఎన్టీఆర్ కుటుంబంలోని ముఖ్యులంతా అల్లుడు పక్షాన చేరిపోతారు. వాళ్లతో కలిసి పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది...? వైస్రాయ్ ఉదంతం ఏంటి ?

ఎన్టీఆర్ మరణానికి దారితీసిన పరిణామాలు ఏంటి అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజాలను సినిమా ద్వారా చూపిస్తా అని వర్మ ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు.. ఆ నిజాలను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు వర్మ. ఎన్టీఆర్ ఎందుకు ఒంటరివాడు కావాల్సి వచ్చింది. ఎలా లక్ష్మి పార్వతికి దగ్గర అయ్యాడు. వారిద్దరి మధ్య ప్రేమ కలగడానికి దారితీసిన సంఘటనలు ఏంటి.. ఎన్టీఆర్ మరణానికి ముందు ఎలాంటి పరిణామాలు జరిగాయనే వాటిని సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు వర్మ. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ భాగం వీరిద్దరి చుట్టే నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది.

ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిల వివాహం తరువాత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా దూరం కావడం.. ఎన్టీఆర్ అవమానాలు పాలవ్వడం వంటి వాటిని చక్కగా చూపించారు. సెకండ్ హాఫ్ ను వర్మ చాలా తెలివిగా డీల్ చేశాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా.. చిత్రీకరించాడు. కళ్యాణి మాలిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. చాలా కాలం తరువాత వర్మ తన మార్క్ స్టైల్ తో సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించాడని చెప్పొచ్చు.

నటీనటుల పనితీరు:

పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఎన్టీఆర్ గా పి. విజయ్ కుమార్ అనే వ్యక్తిని తీసుకోవడంతోనే వర్మ సగం సక్సెస్ అయ్యాడు. విజయ్ నటన అచ్చు ఎన్టీఆర్ ను తలపించింది. అటు లక్ష్మి పార్వతి పాత్రలో నటించిన యజ్ఞాశెట్టి జీవించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మిగతా పాత్రల్లో ఇతర నటులు మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

వర్మ గురించి చెప్పాలి అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తే చాలు అనిపించే విధంగా తీశాడు. వర్మలోని టాలెంట్ ను తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. రమ్మీ అందించిన ఫోటోగ్రఫి చాలా కొత్తగా ఉంది. కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు డబుల్ ప్లస్ అయింది.

ఈ సినిమా కి 'గోల్డెన్ సినిమాస్' వారు గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు.

చివరిగా : లక్ష్మీస్ ఎన్టీఆర్ - వర్మ ఈజ్ బ్యాక్

మాగల్ఫ్ రేటింగ్ : 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com