రాష్ట్రపతి పర్యటన నేటి తో ముగియనుంది ..
- December 30, 2015
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రతి ఏటా హైదరాబాద్ రావడం ఆనవాయితీ. చాలా మంది రాష్ట్రపతుల మాదిరిగానే ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనిని కొనసాగించారు. ఈ నెల 18 నుంచి 31 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. శీతాకాల విడిదిలో భాగంగా దక్షిణాదిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈనెల 19 ఎంసీఈఎంఈ స్నాతకోత్సవానికి హాజరు .... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 18న హైదరాబాద్ వచ్చారు. హకీంపేటలో ఉన్న వాయుసేన విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఆ మరుసటి రోజు..అంటే ఈనెల 19న ఆయన సికింద్రాబాద్లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్లో జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యారు. దేశ రక్షణలో సైనికులు పోషిస్తున్న పాత్ర, యుద్ధతంత్రంలో టెక్నాలజీ ఆవశ్యత గురించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈనెల 22, 23 తేదీల్లో గుల్బర్గ , బెంగళూరుల్లో పర్యటన ....... ఆతర్వాత రెండు రోజుల పాటు ప్రణబ్ ముఖర్జీ కర్నాటకలో పర్యటించారు. ఈనెల 22, 23 తేదీల్లో గుల్బర్గ, బెంగళూరుల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 22న గుల్బర్గలోని కర్నాటక కేంద్ర విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. విద్యావ్యవస్థలో ప్రమాణాల ఆవశ్యకత గురించి ఆయన ప్రసంగించారు. 23న బెంగళూరులోని కిద్వాయ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాజీలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ నిర్మాణానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శంకుస్థాపన చేశారు. అలాగే బిషప్ కాటన్ బాయిస్ స్కూల్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అదే రోజు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ కొత్త భవనాలను ప్రారంభించి, సికింద్రాబాద్ చేరుకున్నారు. ఈనెల 27 న ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సదస్సు ......... ఈనెల 25న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఐ భీమవరంలోని టీటీడీ వేద పాఠశాలను ప్రారంభించారు. అదే రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని సికింద్రాబాద్కు తిరిగి వచ్చారు. ఈనెల 27న హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ తీరుతెన్నులపై ప్రసంగించారు. ఆదే రోజు ఆయన మెదక్ జిల్లాలో ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి హాజరు కవాల్సి ఉన్నా..అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయారు. గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్ భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ గౌరవార్ధం విందు ఇచ్చారు. బుధవారం జంటనగరాలకు చెందిన ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్ తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాల్ మనీ , కల్తీ మద్యం , విశాఖ బాక్సైట్ జీవో 97 పై ఫిర్యాదు ..... ప్రణబ్ హైదరాబాద్లో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత జగన్ సహా వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలిశారు. వైసీసీ అధినేత జగన్ కాల్ మనీతోపాటు..విజయవాడ కల్తీ మద్యం, విశాఖ మన్యంలో బాక్సైట్ నిక్షేపాల తవ్వకానికి అనుమతిస్తూ సీఎం చంద్రబాబు సర్కార్ జారీ చేసిన 97 వ జీవో..వంటి అంశాలను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ పీసీసీ నేతలు... కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జూన్ 29 నుంచి జులై 8 వరకు బొల్లారంలో బస ...... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడం ఇది రెండోసారి. జూన్ 29 నుంచి జులై 8 వరకు ఇక్కడే ఉన్నారు. దక్షిణాదిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్లో శీతాకాల విడిది కోసం ఆయన హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే అప్పట్లో ఢిల్లీలోని మిలటరీ ఆస్పత్రిలో హుద్రోగ శస్త్రచికిత్స చేయించుకోవడంతో దక్షిణాది విడిదికి రాలేకపోయారు. దీంతో జూన్, జులైలో పది రోజుటు పాటు ఇక్కడకు వచ్చి బొల్లారంలో బస చేశారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









