ఈ వీడియో చూడండి..రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు: ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

- April 11, 2019 , by Maagulf
ఈ వీడియో చూడండి..రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు: ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పుందని కాంగ్రెస్ ఆరోపించింది. అమేథీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ భద్రతలో లోపాలు తలెత్తినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అమేథీలో పర్యటించినపుడు ఏడు సార్లు ఆయన తలపై గ్రీన్ లేజర్ పాయింట్ చేసినట్టు వారు తెలిపారు. 'ఆయన మాట్లాడుతున్న క్లిప్ ను చూసినపుడు కనీసం 7 సార్లు ఆయన తలపై లేజర్ పాయింట్ కనిపించిందని' ఆ లేఖలో రాశారు.

ఆ లేజర్ కాంతి ఒక స్నైపర్ తుపాకీది కావచ్చని ఆ లేఖలో తెలిపారు. 'ఆ వీడియోని చూసిన మాజీ భద్రతా సిబ్బంది సహా వివిధ వ్యక్తులు అలాంటి లేజర్ ఏదైనా ఆయుధం నుంచి వెలువడి ఉండవచ్చని, అది స్నైపర్ గన్ కావచ్చనే తెలిపినట్టు' కాంగ్రెస్ అంటోంది. ఆ లేఖపై కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, రణ్ దీప్ సూర్జేవాలా, జైరామ్ రమేష్ సంతకాలు చేశారు.

ఏప్రిల్ 10న రాహుల్ గాంధీ 2019 లోక్ సభ ఎన్నికల్లో తన నామినేషన్ వేసేందుకు అమేథీకి వచ్చారు. నామినేషన్ వేసిన తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడుతుండగా ఆ లేజర్ కాంతి ఆయనకు గురిపెట్టినట్టు కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వీడియో ఉన్న ఓ పెన్ డ్రైవ్ ని లేఖతో సమర్పించింది. లేజర్ కాంతి రాహుల్ గాంధీ నుదుటిపై గురిపెట్టి ఉందని లేఖలో తెలిపింది. 

గాంధీ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డారని, ఇప్పుడు రాహుల్ గాంధీని హత్య చేసే అవకాశాలు ఉండటం దిగ్భ్రాంతికి, ఆందోళనకి గురి చేస్తోందని కాంగ్రెస్ తెలిపింది. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు తప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ యంత్రాంగాన్ని కాంగ్రెస్ కోరింది. జరుగుతున్న ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్న రాహుల్ గాంధీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com