చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

- April 14, 2019 , by Maagulf
చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. పోలింగ్‌ జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సీఈసీతో భేటీ అయ్యారు. ఎన్నికల సంఘం వైఫల్యాలపై 18 పేజీల లేఖను సీఈసీకి ఇచ్చారు. మరోవైపు.. చంద్రబాబుకు దేశవ్యాప్తంగా అగ్రనేతల మద్దతు లభిస్తోంది. అటు… దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం సోమవారం చర్చకు రావాలంటూ…టీడీపీకి లేఖ రాసింది.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు…. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదంటూ మండిపడ్డారు. ఏపీలో పోలింగ్ తీరు, ఈవీఎంల సమస్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ సీనియర్ నేతలతో కలసి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. సీఈసీ ప్రధాన కమిషనర్ సునీల్ అరారోతో సమావేశమయ్యారు. సీఈసీకి 18 పేజీల లేఖ అందించారు. దాదాపు గంటన్నర పాటు సీఈసీతో సమావేశమైన చంద్రబాబు, అర్థరాత్రి వరకు ఓటర్లు క్యూ లైన్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఓటర్లేమైనా బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ నిగ్గదీశారు.

ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు చంద్రబాబు. సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ సహా పలువురు అధికారులను సరైన కారణం లేకుండానే బదిలీ చేశారంటూ ఆగ్రహం వ్యకం చేసారు. ఎలక్షన్ కమిషన్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, వైసీపీకి అనుకూలంగా ఈసీ పని చేసిందంటూ మండిపడ్డారు

ఈవీఎంలపై చంద్రబాబు మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎం లపై గతంలో కూడా ఫిర్యాదు చేశామని, 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని కోరామని గుర్తు చేశారు. బ్యాలెట్ పద్దతి పాటించాలని పదే పదే అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఏపీలో ఏడున్నర లక్షల ఓట్ల తొలగింపుపై దర్యాప్తునకు ఈసీ సహకరించడం లేదని విమర్శించారు.

ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్న చంద్రబాబు… దీనిపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్ధతు కూడగడుతామన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండి.. వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతామన్నారు. మరోవైపు… ఈవీఎంలపై జరుగుతున్న పోరాటంలో చంద్రబాబుకు దేశంలోని పలు పార్టీల అగ్రనేతల మద్ధతు లభిస్తోంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ ఆధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును అడిగి తెలుకున్నారు. అటు మాజీ ప్రధాని దేవేగౌడ సైతం చంద్రబాబుతో మాట్లాడారు.

మరోవైపు… ఈవీఎంల వివాదంపై…. సీరియస్‌గా ఉన్న చంద్రబాబు…అహ్మద్‌పటేల్‌, కపిల్‌ సిబల్‌తో చర్చలు జరిపారు. చంద్రబాబుతో అహ్మద్‌పటేల్‌ సమావేశం కొనసాగుతుండగానే… ఏపీ భవన్‌కు వచ్చారు సాంకేతిక నిపుణులు శ్యామ్‌ పిట్రోడా. ఈవీఎంల సాంకేతిక సామర్థ్యంపై ఆయనతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఈసీ వ్యవహారాశైలిపైనా చర్చ జరిగింది.

మరోవైపు.. ఏపీ ఎన్నికల వైఫల్యాలపై సీఎం చంద్రబాబు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంల నిపుణులతో చర్చకు సిద్ధమని సీఈసీ స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు చర్చకు రావాల్సిందిగా లేఖ రాసింది.. అయితే ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకి చెందిన టెక్నికల్ టీం హరిప్రసాద్‌తో చర్చించేందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది ఈసీ. ఆయనను కాకుండా ఇతర సాంకేతిక నిపుణులను పంపిస్తే చర్చించేందుకు సిద్ధమని లేఖలో పేర్కొంది. ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలను సమాధానంగా లేఖ రాయాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com