తెలంగాణలో మరో ఎన్నికలు నగరా ..

- April 13, 2019 , by Maagulf
తెలంగాణలో మరో ఎన్నికలు నగరా ..

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడే లోపు తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మండల, జిల్లా పరిషత్‌ల పాలక వర్గాల పదవీ కాలం జూన్‌ 4,5 తేదీల్లో ముగియనున్న నేపథ్యంలో దానికంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సన్నద్ధమవుతోంది. ఈ నెల 15న స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో…. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలతో పాటు మండల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులకు కూడా ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ఓటర్ల సంఖ్య కోటీ 56 లక్షలా 11 వేలా 320. ఎన్నికల కోసం మొత్తం 32 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కోసం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో పాటు సిబ్బందికి ఇప్పటికే నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులను సైతం ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈవీయంలతో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉన్నా… వివిప్యాట్ లు సరిపడా రాష్ట్రంలో అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండంతో వివి ప్యాట్ ల కొరత ఉంది. దీంతో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం అవసరమైన ఎడిబుల్ ఇంక్ 15వ తేదీ లోగా జిల్లాలకు చేరనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అటు ఎన్నికల సన్నద్దతలో భాగంగా ముందుగా సీనియర్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ నెల 15వ తేదీన సీఎస్, డీజీపీతో పాటు ఇతర సీనియర్ అధికారులతో ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోనూ ఎస్ఈసీ సమావేశవుతుంది.

నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదలైనా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఈ ఎన్నికల నిర్వహణను కొత్త జిల్లాల వారీగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు 9 జిల్లాల్లో మాత్రమే జిల్లా పరిషత్‌లు ఉండగా, ప్రస్తుతం కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఈలోగా కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే… అందుబాటులో ఉన్న మంత్రులు, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్… కొత్త చట్టానికి సంబంధించి పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే విషయమై అధికారులు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు. మెజారిటీ జిల్లాల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తక్కువ స్థానాలు ఉన్న జిల్లాల్లో ఒకే విడతలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. ఎక్కువ స్థానాలు ఉన్న నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, భద్రాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నాగర్ కర్నూల్ లాంటి జిల్లాలతో పాటు శాంతిభద్రతల పరంగా ఇబ్బంది ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ములుగు తదితర జిల్లాల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com