కర్ణాటక లో విద్యార్థిని హత్య కలకలం

కర్ణాటక లో విద్యార్థిని హత్య కలకలం

బెంగళూరు: రాయచూరులోని సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ మృతి కేసు కర్ణాటకలో సంచలనంగా మారింది. మరణించిన 3 రోజులకు మృతదేహాన్ని గుర్తించడం, ఘటనాస్థలంలో లభించిన లేఖ తదితర అంశాలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. తమ బిడ్డ ఏమయిందో అన్న ఆందోళనతో తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు. న్యాయం కోసం అధికారులు, ప్రముఖుల తలుపులు తట్టారు. తమ ఫిర్యాదును వెంటనే తీసుకుని విచారణ చేసి ఉంటే తమ కుమార్తె తమకు దక్కేదంటూ ఆక్రోశిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళనతో మేల్కొన్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నిందితుడు సుదర్శన్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


అనుమానాలు 
ఇంటర్నల్‌ పరీక్షలంటూ ఈ నెల 13న మధు ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రానికి రాకపోవటంతో తల్లిదండ్రులు నగరంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడి రైటర్‌ ఆంజనేయులు ఫిర్యాదును స్వీకరించలేదు. పలు ప్రశ్నలతో సమయం వృథా చేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు నాగరాజు, రేణుకాదేవీ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల తర్వాత రైటర్‌ వారిని పిలిచి విద్యార్థిని ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం, చరవాణి కళాశాల ఆవరణలో ఉన్నాయి తెచ్చుకోవాలని చెప్పడంతో తల్లిదండ్రుల్లో అనుమానం బలపడింది. మూడో రోజు మధు సగం కాలిన శవంగా, అది కూడా ఉరేసుకున్న స్థితిలో కనిపించింది. అన్నీ సబ్జెక్టులు ఫెయిలైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఘటనా స్థలంలో లభించిన లేఖపైనా తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతున్నారు. లేఖ కన్నడంలో ఉందని తమ బిడ్డకు ఆ భాషే రాదని అలాంటిది లేఖ ఎలా రాస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా అన్ని సబ్జెక్టులు పాసయిందని తెలిపారు. మధు కనిపించని రోజే ఓ వ్యక్తి తమ ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించామని.. అ తర్వాత అప్రమత్తమై మధుకు సంబంధించిన వస్తువులన్నింటినీ భద్రపర్చామని విద్యార్థిని తల్లిదండ్రులు వివరించారు. ఈలోగా తమ బిడ్డను హత్య చేశారని వారు ఆరోపించారు. నిందితుడు సుదర్శన్‌ యాదవ్‌ రైటర్‌ ఆంజనేయులుకు బంధువు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ కేసుకు పోలీసులు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై విద్యార్థులు, మహిళా సంఘాలు, సినిమా తారల నుంచి ఆందోళన వ్యక్తమైంది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండుతో సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం జోరందుకుంది. కళాశాల విద్యార్థులు 'జస్టిస్‌ ఫర్‌ మధు' హ్యాష్‌ట్యాగ్‌ పేరిట ఆందోళన ప్రారంభించారు. భారతీయ మహిళా సాంస్కృతిక సంఘటనతోపాటు పలు బృందాలు సైతం ఈ కేసుపై వేగంగా విచారణ జరిపించాలని డిమాండు చేశాయి. ఈ ఒత్తిడిని గుర్తించిన ముఖ్యమంత్రి కుమారస్వామి కేసును సీఐడీకి అప్పగించారు. ఆదివారం సీఐడీ బృందం విచారణ ప్రారంభించింది.

Back to Top