మరో దేశాధ్యక్షుడితో కిమ్ జోంగ్‌ ఉన్‌ సమావేశం

- April 25, 2019 , by Maagulf
మరో దేశాధ్యక్షుడితో కిమ్ జోంగ్‌ ఉన్‌ సమావేశం

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యా చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన సమావేశం కానున్నారు. మొట్టమొదటిసారి ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అవుతున్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎటువంటి ‌ఒప్పందాలపై సంతకాలు చేయడం కానీ, సంయుక్త ప్రకటన చేయడం వంటి అంశాలపై కానీ.. ముందుగా ప్రణాళికలు వేసుకోలేదు. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి రష్యాకు కిమ్‌.. ప్రత్యేక రైలులో వచ్చారు. ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతం ఖాసన్‌లోని రైల్వే స్టేషన్‌ నుంచి రష్యాలోని వ్లాదివోస్తోక్‌లోకు తొమ్మిది గంటల్లో చేరుకోవచ్చు. ఆయన రష్యాకు చేరుకోగానే ఆ దేశ అధికారులు తమ సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వాగతం పలికారు.

అణ్వాయుధ సమస్యపై అమెరికా, ఉత్తరకొరియా మధ్య రెండుసార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ గతేడాది మొదటిసారి సింగపూర్‌లో తొలిసారి భేటీ అయ్యారు. రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలోని హనోయిలో చర్చించారు. అయితే, ఏ నిర్ణయమూ తీసుకోకుండానే చర్చలు ముగిశాయి. ట్రంప్‌తో ముచ్చటగా మూడోసారి సమావేశం కావడానికి తాను సిద్ధమని, అయితే, అమెరికా కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల కిమ్‌ ప్రకటించారు. గతంలో ఆయన ట్రంప్‌తో భేటీ కావడానికి ముందు, ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ప్రపంచంలో తాము ఒంటరిగా లేమన్న సందేశాన్ని ఇవ్వడానికి కిమ్‌ ఇతర దేశాల అధ్యక్షుడితో భేటీ అవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com