ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ తప్పులు జరగకుండా చూసుకోండి..!

- April 25, 2019 , by Maagulf
ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ తప్పులు జరగకుండా చూసుకోండి..!

సమాజంలో పెరుగుతున్న సంపాదనతో పాటు బ్యాంకులు క్రెడిట్ కార్డుల జారీని కూడా పెంచేశాయి. ప్రైవేట్ బ్యాంకులు ఇబ్బడి ముబ్బడిగా క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తున్నాయి. నగదు రహిత లావాదేవీల కోసం ఇప్పుడు అందరూ కార్డుల మీదే ఎక్కువ ఆధార పడటం, ఆన్‌లైన్‌ షాపింగ్‌లు పెరిగి పోవడంతో  క్రెడిట్‌ కార్డులకు డిమాండ్ పెరిగిందనే చెప్పొచ్చు. క్రెడిట్ కార్డుల సంఖ్య పెరగడంతో ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగిపోయాయి.

తొలి సారి క్రెడిట్ కార్డు హోల్డర్స్ పైనే దొంగల దృష్టి..!
క్రెడిట్ కార్డ్ ను తొలిసారిగా అందుకున్న కస్టమర్లపైనే ఆన్‌లైన్ మోసగాళ్ళు ఫోకస్ చేస్తారు. మీ ట్రాన్సక్షన్స్‌ను వారు నిశితంగా గమనిస్తుంటారు. బ్యాంకుల నుండో , లేదా ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రీగా ఇస్తున్నామనో కాల్ చేస్తారు. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ , వెనుక ఉండే వివరాలు , త్రీ డిజిట్ నెంబర్ల(CVV)ను అడుగుతారు. క్రెడిట్ కార్డ్ హోల్డర్ కనుక ఒక్కసారి మోసగాళ్ళను నమ్మి ఆ వివరాలను చెబితే.. ఇక అంతే.. మోసగాళ్ళ ఉచ్చులో వారు పడినట్టే. సాధారణంగా ఏ బ్యాంకు గానీ, ఇన్సూరెన్స్ వారు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ మీ క్రెడిట్ కార్డ్ వివరాలను, మీ ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌ వర్డ్‌లను అడగరు. తరచూ బ్యాంకులు ఈ మోసపూరిత విధానాల గురించి ప్రచారం చేస్తున్నా.. అది వినియోగ దారుల చెవికెక్కడం లేదు. రిజర్వ్ బ్యాంకు సమాచారం మేరకు గత జనవరి వరకూ దేశంలో జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య దాదాపు 45.17 మిలియన్లు. (సుమారు 4 కోట్లకు పైనే ) .  అంతకు ముందు సంవత్సరం ఇది 36.24 మిలియన్స్‌గా ఉంది. ఒక్క సంవత్సరంలోనే 9 మిలియన్ల క్రెడిట్ కార్డులను బ్యాంకులు జారీ చేశాయి. ఇక సైబర్ నేరాలు, ఆర్ధిక నేరాల పరిథిలో ఎక్కువగా క్రెడిట్ కార్డ్ మోసాల మీదే ఫిర్యాదులు అందుతున్నాయని తెలుస్తుంది. అదీ తొలి సారిగా క్రెడిట్ కార్డ్ వాడే వారి నుండే ఈ ఫిర్యాదులు అందుతున్నాయి. మోసగాళ్లు , ఆర్ధిక మోసాలకు పాల్పడే చోరులు ఎక్కువగా తొలి సారి క్రెడిట్ కార్డ్ వాడే వారినే టార్గెట్ చేయడంతో వినియోగ దారులు బలిపశువులుగా మారుతున్నారు.

ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట ఇలా వేయండి..!
మీ క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేసుకున్నాక మందు మీ పాస్‌వర్డ్ ను చాలా స్ట్రాంగ్‌గా ఉంచుకోండి. ఒక్కసారి బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చాక తిరిగి వివరాలు చెప్పమని కోరవు గాక కోరవు. ఇది ముందు మీరు గుర్తు పెట్టుకోవాలి. అలాగే.. ఏ బ్యాంకులు గానీ, ఇతర ఆర్ధిక సంస్థలు గానీ మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కావాలని కోరవు. బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం, మీ కార్డ్ అప్ డేట్ చేయాలి అని ఫోన్ వస్తే.. ఖచ్చితంగా అది నేరస్థుల నుండి వచ్చిన కాల్‌గా గుర్తించాలని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నారు. అలాగే మీ ఫోన్‌కు మీ ప్రమేయం లేకుండానే OTP ( వన్ టైమ్ పాస్‌వర్డ్ ) వచ్చిందంటే..వెంటనే మీరు అప్రమత్తం కావాల్సిందే. మీరు ఆన్‌ లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్‌కు OTP వస్తుంది. అంతేకానీ,, మీ ప్రమేయం లేకుండా మీ సెల్‌కు పాస్ వర్డ్ వచ్చిందంటే.. మీరు అనుమానించాల్సిందే. అలాగే.. మీ మెసెజ్‌లు ఇతరులతో షేర్ చేయకూడదు. వన్ టైం పాస్‌వర్డ్ ను అసలు షేర్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మీ క్రెడిట్ కార్డు పాస్‌వర్డ్ ను తరుచూ మారుస్తూ ఉండటం కూడా మీ కార్డ్ సెక్యూరిటీని పెంచుతుంది.

కార్డ్ స్వైపింగ్ అప్పుడు జాగ్రత్తగా ఉండండి..!
ఏదైనా సూపర్ మార్కెట్ గానీ, షాపింగ్ మాల్‌లో గానీ మీరు కార్డ్ స్వైపింగ్ ద్వారా నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు కార్డు మిషన్‌లో ఒక్కసారే స్వైప్ చేయాలి. లేదా అవతలి వ్యక్తులు మీ కార్డ్ ను రెండు సార్లు స్వైప్ చేసి మిషన్‌కే మీ కార్డును ఉంచినట్టయితే..అనుమానించాల్సిందే అని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. రెండో సారి కార్డు స్వైప్‌ చేసినప్పుడు మీ కార్డ్ మీద వుండే మాగ్నెట్ స్ట్రిప్‌ ద్వారా మీ సమాచారాన్ని వారు దొంగిలించే అవకాశం ఉందని వారు అంటున్నారు.

క్రెడిట్ కార్డ్ రోజు వారి వినియోగానికి లిమిట్స్ పెట్టుకోవచ్చు..!
క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. మీ క్రెడిట్ కార్డ్ వాడకం పై లిమిట్ పెట్టుకోవచ్చని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. రోజు వారి ఇంత ఎమౌంట్ కంటే ఎక్కువ వాడకుండా లిమిట్ ఆప్షన్‌కు ఎంచుకుంటే.. మీ రోజువారి పరిమితి కంటే ఎక్కువగా ఎవరైన మోసం చేద్దామనుకున్నా వారి ఆటలు సాగవు. అలాగే చాలా మంది తమ క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్లను ఫోన్లలో సేవ్ చేసి పెట్టుకుంటారు. ఇది కూడా మోసగాళ్ళకు వరంలా మారుతుంది. మీ ఫోన్లోని  సమాచారం అంత సురక్షితం కాదని మీరు గుర్తు పెట్టుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com