హైదరాబాద్ డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారింది
- May 04, 2019
హైదరాబాద్:ఇన్ని రోజులు మనం హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేయడాన్ని చూశాం. డ్రగ్స్ పెడిలర్ల ద్వారా హైదరాబాద్‌కు మత్తు పదార్థాలు విదేశాల నుంచి భారీగా రవాణా జరిగేది. కానీ ఇప్పుడు ఏకంగా మన నగరమే డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారింది. అవును మీరు విన్నది నిజమే. తాజాగా నార్కోటిక్ అధికారులు నిర్వహించిన దాడుల్లో నాచారంలో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు కావడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో డేట్ రేప్ డ్రగ్, పార్టీ డ్రగ్‌గా పేరొందిన కెటమైన్‌ను అక్రమంగా తయారుచేస్తున్న ల్యాబ్‌ను గుర్తించిన నార్కొటిక్ అధికారులు. ల్యాబ్‌పై ఆకస్మిక దాడులు చేశారు. ల్యాబ్‌ను సీజ్ చేసిన అధికారులు.. ఆ కంపెనీ డైరెక్టర్ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నాచారం పారిశ్రామిక వాడలో ఇ-కెమ్ కెమికల్ ల్యాబ్ పేరుతో వెంకటేశ్వర్లు ఐదేళ్లుగా గుట్టుగా డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. తయారు చేసిన మాదక ద్రవ్యాలను బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు తరలించి కోట్లు ఆర్జిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
కెటమిన్ డ్రగ్‌ను బెంగళూరులో సరఫరా చేస్తున్న ముఠా ఒకటి.. రెండు రోజుల క్రితం ఎన్‌సీబీ అధికారులకు పట్టుబడింది. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారించడంతో ఈ డ్రగ్స్ డొంక కదిలింది. నాచారం పారిశ్రామిక వాడలోని ఇ-కెమ్ ల్యాబ్‌లో తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో హైదరాబాద్ చేరుకున్న బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు…ఇక్కడి నార్కోటిక్ అధికారులతో కలిసి ఇ-కెమ్ ల్యాబ్‌పై దాడులు నిర్వహించారు.
సాధారణంగా కెటమిన్ డ్రగ్‌ను జంతువులకు మత్తు ఇవ్వడానికి వినియోగిస్తారు. సెక్స్ డ్రగ్‌గానూ పిలిచే కెటమైన్ వాడకంతో గుర్రాలతో పాటు మనుషులకూ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. కొన్నిసందర్భాల్లో డిప్రెషన్‌తో బాధపడేవారికి, నొప్పినివారణకు కూడా డాక్టర్లు దీన్ని సిఫారసు చేస్తారు. ఈ డ్రగ్ వాడితే ఒకరకమైన మత్తులోకి వెళ్తారు. ప్రతిఘటించే శక్తిని కోల్పోతారు. పార్టీల్లో ఈ డ్రగ్‌ను అమ్మాయిలు తాగే పానీయాల్లో కలిపి వారు స్పృహ తప్పాక అత్యాచారాలకు పాల్పడుతున్న కేసులు చాలా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ లోని కొన్ని ప్రత్యేకమైన ప్రొవిజన్ల ద్వారానే వైద్యపరమైన అవసరాల కోసమే ఈ డ్రగ్‌ను తయారుచేస్తారు. కానీ నాచారంలో దీన్ని విచ్చలవిడిగా తయారుచేస్తూ.. ఇతర రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు.
ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు ఐదేళ్లుగా నాచారంలో ఇ-కెమ్ ల్యాబ్ డ్రగ్స్ తయారు చేస్తుంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం దాన్ని గుర్తించలేకపోయారు. బెంగళూరు నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగితే కానీ ఇక్కడ డ్రగ్స్ ఫ్యాక్టరీ ఉందని తెలుసుకోలేకపోయారు. పోలీసుల నిఘా లేకపోవడంతో గత ఐదేళ్లుగా ఈ ముఠా డ్రగ్స్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
ఒక్క నాచారమే కాదు.. సైబరాబాద్, రాచకొండ పరిధుల్లోని ఇండస్ట్రీస్, ఫార్మా పారిశ్రామిక వాడలు డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారుతున్నాయి. మూతబడిన పరిశ్రమలను, ల్యాబ్‌లు, గోదాములే కేంద్రంగా కొందరు కేటుగాళ్లు డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు. పోలీసులుగానీ, ఇటు ఎన్‌సీబీ అధికారులు కానీ ముందే గుర్తించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







