రష్యా లో ఘోర విమాన ప్రమాదం.. 41మంది మృతి
- May 06, 2019
రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాస్కోలోని షెరమిత్యేవో ఎయిర్‌పోర్టు నుంచి ఆర్కిటిక్ ప్రాంతంలోని ముర్మాన్స్క్ నగరానికి బయల్దేరిన విమానంలో.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే మంటలు శరవేగంగా వ్యాపించడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఎయిర్ స్టీవార్డ్ సహా మొత్తం 41 మంది మరణించగా, దాదాపు 10 మందికి గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో 73 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగడానికి పిడుగుపడటమే కారణమని రష్యాకు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. దట్టమైన నల్లని పొగతో, నిప్పులు చిమ్ముకుంటూ నింగి నుంచి దూసుకువచ్చిన విమానం రన్‌వేపై వెళ్తున్న దృశ్యాలు.. విమానం ఆగాక అందులోని ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి కిందికి జారి, ప్రాణాలు అరచేత పెట్టుకుని అక్కణ్నుంచీ పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. విమానానికి మంటలు అంటుకున్నాయని, ప్రాణాపాయం ఉంది కాబట్టి వెంటనే అత్యవసర ద్వారాల గుండా కిందికి దిగాలని సిబ్బంది ఎంతగా చెప్పినా వినకుండా ప్రయాణికులు తమ లగేజీ తీసుకుని దిగడానికి ప్రయత్నించారని, దీనివల్ల వారిని కిందికి దించడం కొంత ఆలస్యమైందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.
రష్యన్ మేడ్ సూపర్‌జెట్-100 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాంట్లోని సిబ్బంది సమస్య ఉందంటూ సంకేతాలిచ్చారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్ ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. రెండోసారి కిందికి దించగలిగినా అప్పటికే విమానం మంటల్లో చిక్కుకుంది. విమానం వెనుక భాగం పూర్తిగా కాలిబూడిదైపోయింది. ప్రయాణికులను రక్షించే క్రమంలో ఒక ఫ్లైట్ అటెండెంట్ మరణించింది. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక ప్రయాణికుడు.. తాను క్షేమంగా ఉన్నానని ట్విటర్‌లో వెల్లడించాడు. ల్యాండ్ కావడానికి ముందు ఈ విమానం మాస్కో చుట్టూ రెండుసార్లు రౌండ్లు కొట్టిందని.. దాదాపు 45 నిమిషాల తర్వాత ల్యాండ్ అయిందని ఫ్లైట్ రాడార్ ట్రాకింగ్ సర్వీసు చూపడం గమనార్హం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..