భానుడి భగభగలు..భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు

భానుడి భగభగలు..భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు

ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఈ వేసవిలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాడు పగిలిపోయేలా ఎండల తీవ్రత ఉంటోంది. ఎండల తీవ్రతకు వేడిగాలులు తోడయ్యాయి. వేడిగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. శనివారం (మే 25,2019) హైదరబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాదాపూర్ లో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. పాశమైలారంలో 43.5, ఖైరతాబాద్ లో 43.2, బేగంపేటలో 42.2, అంబర్ పేట్ లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాదాపూర్ లో ఈ స్థాయిలో ఎండల తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం (మే 26,2019) ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

మాడు పగిలే ఎండలు, వడగాలులతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చెయ్యడం లేదు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పనులకు వెళ్లే రైతులు, కూలీలు వడదెబ్బతో ఆస్పత్రులపాలవుతున్నారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు సాయంత్రం వరకు రోడ్ల మీదకు రాకపోవడమే మంచిదంటున్నారు. బాలింతలు, పిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Back to Top