ఆ వార్త భారతీయులకు పిడుగులాంటిదే మరి
- May 27, 2019
వాషింగ్టన్: వీసా విధానాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నవన్నీ చేస్తున్నారు. ఇప్పటికే హెచ్-1బీ వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిపై నిషేధం విధించే ప్రక్రియ ప్రారంభించారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలగించేలా ట్రంప్ సర్కార్ గతంలో ప్రతిపాదనలు తయారుచేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ఇటీవల నోటీసులు జారీ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ రెండో దశకు చేరుకుందట. ఇక్కడ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే.. వాటిని ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురిస్తారు. ఆ తర్వాత కొత్త ప్రతిపాదనలపై 30-60 రోజుల వరకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు వీలుంటుంది. అనంతరం దీనిపై చట్టం తీసుకొస్తారు. అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు.
కాగా.. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారతీయులే ఎక్కువగా నష్టపోతారు. హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్-4 డిపెండెంట్ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. దీన్ని భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది.
2015 నుంచి హెచ్-4 వీసా కింద అమెరికాలో 1.2 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో 90శాతం మంది భారతీయులే. ముఖ్యంగా భారత మహిళలే. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇకపై హెచ్-1బీ వీసాదారుల కుటుంబాల్లో ఒకరు మాత్రమే ఉద్యోగం చేసేందుకు వీలుంటుంది. దీంతో వీరు ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..