నవ్యాంధ్రలో కీలక ఘట్టం పూర్తైంది...

- June 08, 2019 , by Maagulf
నవ్యాంధ్రలో కీలక ఘట్టం పూర్తైంది...

అమరావతి:ఏపీలో కీలక ఘట్టం పూర్తైంది.నవ్యాంధ్రలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఒక్కొక్కరి చేత ప్రమాణం చేయించారు.మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో అమరావతి సందడిగా మారింది. జిల్లాల వారీగా మంత్రులంతా ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి ప్రమాణస్వీకారం చేశారు.

దైవసాక్షిగా మంత్రులంతా ప్రమాణస్వీకారం చేశారు.దాదాపు 50 నిమిషాల పాటు ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగింది. ఇద్దరు మంత్రులు గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ మాత్రం ఇంగ్లీష్‌లో ప్రమాణం చేస్తే.. మిగతావారంతా తెలుగులోనే ప్రమాణం చేశారు.గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొత్త మంత్రులను అభినందించారు.మంత్రులుగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులతో, వైసీపీ ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. తమ అభిమాన నేతలు ప్రమాణం చేస్తుంటే కార్యకర్తలు ఈలలు, కేరింతలతో చప్పట్లు కొట్టారు.

ఏపీ మంత్రివర్గం కొలువుదీరింది.25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.ముఖ్యమంత్రిగా జగన్ మే 30న ప్రమాణస్వీకారం చేస్తే.. ఇవాళ కేబినెట్‌ సహచరులంతా ప్రమాణం చేశారు. దాదాపు 6వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.ఇవాళ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వచ్చిన వైఎస్ జగన్.. 3 ఫైళ్లపై సంతకాలు చేశారు. సచివాలయ ఉద్యోగులతోనూ, HODలతోనూ సమావేశమయ్యారు.ఆ తర్వాత మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారు అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది.అలాగే డిప్యూటీ సీఎంలుగా ఎవరెవరు ఉంటారు అనే ఉత్కంఠ కూడా వీడబోతోంది.ఇక సోమవారం కేబినెట్ తొలి సమావేశం జరగబోతోంది.సచివాలయ సిబ్బంది కొత్త మంత్రుల ఛాంబర్లు.. ఇతరత్రా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com