ETCA ఆధ్వర్యంలో దుబాయ్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- June 08, 2019 , by Maagulf
ETCA ఆధ్వర్యంలో దుబాయ్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

దుబాయ్:తెలంగాణ ఉద్యమంలోని వీరులను,వివిధ రంగాలలో ప్రావిణ్యం సాధించిన ప్రముఖుల గొప్పతనాన్ని భావితరాలకు తెలిసే విధంగా గొప్ప వ్యక్తుల వేషధారణతో చిన్న పిల్లలు చేసిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది.తెలంగాణ ఔన్నత్యాన్ని, చారిత్రకతను, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పాడిన మంగ్లీ, మాట్ల తిరుపతి పాటలు మరియు ETCA మహిళా విభాగం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్న పిల్లల జానపద నృత్యాలు, సాండ్ ఆర్ట్ కార్యక్రమాలు  అందరిని అలరించాయి. 

కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ గా నిలిచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ , LSPMK మేనేజింగ్ డైరెక్టర్, ETCA అధ్యక్ష్యుడు రాధారపు సత్యంకి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ కార్యక్రమాన్ని ETCA వారి ఆధ్వర్యంలో ఇమాజిన్ స్టార్ ఈవెంట్స్ వారు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదిక నుండి ప్రపంచవ్యాప్తంగా వున్న తెలంగాణ బిడ్డలకు ముందుగా శుభాకాంక్షలు తెలియచేస్తూ,దశాబ్ద కాలం తెలంగాణ లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి ఎన్నో ఎత్తు పల్లాలను అధిరోహించి, ఎన్నో ప్రాణ త్యాగాల తరువాత, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలు అర్థం చేసుకొని  సకల జనులు సంఘటితమయి క్షేత్ర స్థాయిలో పాలకులను కదిలించి సాధించుకున్న స్వరాష్ట్రం మన తెలంగాణ అని, ఆ సాధనలో ఉద్యమానికి సిద్ధాంత కర్తగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ , ఉద్యమానికి నాయక పాత్ర పోషించిన కేసీఆర్, అండగా నిలిచిన కోదండరాం, సైనికులుగా పనిచేసిన విద్యార్థులు,తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేసిన కవులు , కళాకారులు, మేధావులు, పత్రిక విలేకరులు, స్వరాష్ట్ర కాంక్షను ఐక్యతతో చూపించిన కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు, విదేశాలలో సైతం మేము సైతం అంటూ ఉద్యమానికి సంఘీభావంగా నిలిచి పోరాడిన ప్రవాసీ తెలంగాణ బిడ్డల కృషి అబినందనీయమని అందరి కృషిని కొనియాడారు. 

తెలంగాణ ఉద్యమం నుండి గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు తెరాస పార్టీని , కేసీర్ న్యాయకత్వాన్ని బలపర్చారని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే సంతోషపడ్డామని, పరిపాలన తీరును అభినందిచామని దానితో పాటు గల్ఫ్ గడ్డ మీద మన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిస్తూ శక్తి అనుసారం సంక్షేమ కార్యక్రమాలు చేస్తునే ఉన్నామని, గల్ఫ్ సమస్యలపై పని చేసిన అనుభవంతో వాస్తవ పరిస్థితులను తెలియచేస్తూ గల్ఫ్ సంక్షేమం అన్న అంశం పై అన్ని సంఘాలు, సామాజికవేత్తలు ఎన్నో నివేదికలు , అభ్యర్థనలు , విజ్ఞప్తులు  చేసిన ఐదు సంవత్సరాల కాలం గడిచిన  గల్ఫ్ లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డల సంక్షేమం పై ప్రభుత్వం స్పష్టమైన భరోసాను  ను కలిపించలేదని విచారం వ్యక్తం చేసారు, ప్రభుత్వం ఏర్పడిన 4 ఏండ్ల తరువాత 100 కోట్లు ఎన్నారైల సంక్షేమం కోసం వెచ్చిస్తామని ప్రకటించిన దానిపై స్పష్టమైన విధి విధానాలు ప్రకటించపోవడం బాధాకరమని , ఎన్నో కఠిన చట్టాలు ఉన్న గల్ఫ్ దేశాల్లో తొలిదశ  ఉద్యమం నుండి నేటి వరకు గల్ఫ్ బిడ్డలు అండగా ఉన్న విషయాన్ని మరోవొద్దని , తెరాస పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో గల్ఫ్ సంక్షేమం అంశాన్ని చేర్చిందని ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడితే గల్ఫ్ సంక్షేమం పై చర్యలు చేపడుతామని చెప్పిన మాటలు మరవొద్దని , రాష్ట్రం ఏర్పడ్డాక మాజీ ఎన్నారై మంత్రివర్యులు కేటీర్ నేతృత్వంలో ఎన్నారైల సంక్షేమం పై పెట్టిన సదస్సులు , ప్రభుత్వం సేకరించిన సమాచారంతో ప్రభుత్వానికి అందించిన ముసాయిదా కార్యరూపం దాల్చక మరుగున పడటం శోసనీయమని అన్నారు, గల్ఫ్ సంఘాల ప్రతినిధులుగా తెరాస అధినాయకత్వాన్ని కలుద్దామన్న కూడా కష్టతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. 

ఇప్పటికైన ప్రభుత్వం గల్ఫ్ సంక్షేమం పై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో  ఉన్న సాధ్య అసాధ్యాలను పరిశీలించి  ఒక ప్రత్యేక సంక్షేమ విధానం ద్వార  గల్ఫ్ బిడ్డలకు భరోసా కల్పించవలసిన బాధ్యత తెరాస పార్టీ పైన , గల్ఫ్ వలస ప్రభావిత ఉమ్మడి జిల్లాలోని మంత్రుల , శాసన సభ్యుల, లోకసభ సభ్యులదని అన్నారు, లేదంటే దశాబ్ద కాలంగా అభిమానంతో ఉన్న గల్ఫ్ లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని, తెరాస ప్రభుత్వ ఇదే వైఖరిని కొనసాగిస్తే  నిరసనగా గల్ఫ్ దేశాల్లోని సంఘాల, కార్మికుల సహకారంతో  పోరు బాటకు కూడ వెనుకాడమని హెచ్చరించారు. 

రెండవ సారి భారత దేశ పాలన పగ్గాలు చేపట్టిన భాజపా ప్రభుత్వం గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న వలసదారుల సమస్యలను అధ్యయనం చేసి ప్రవాసీ భారతీయుల సంక్షేమానికై  పెద్దపీట వెయ్యాలని,ప్రపంచంలోని  ప్రవాసీ భారతీయుల జనాభాలో 52% గల్ఫ్ దేశాలలో ఉన్నారని , భారత దేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే శాతంలో అత్యధిక శాతం గల్ఫ్ దేశాలకని , ప్రపంచంలోని ప్రవాసీ భారతీయులు కరెన్సీ ఎక్స్చేంజ్ రూపంలో పంపే విదేశీ మారక ద్రవ్యం ద్వార  భారతదేశానికి వచ్చే ఫారిన్ రీమిట్టెన్స్ లో అత్యధిక శాతం గల్ఫ్ దేశాలనుండి అని , భారత దేశం నుండి గల్ఫ్ దేశాలకు వచ్చే విమాన సర్వీసెస్ ప్రపంచంలో అన్నిదేశాలకన్నా గల్ఫ్ దేశాలకని ప్రధానిమంత్రి  నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటనలో అన్న మాటలను గుర్తు చేసారు , భారతీయ జనతా పార్టీ విజయంలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న సుమారు 10 మిలియన్స్ భారతీయుల పాత్ర ఉందని , వారి కుటుంబ సభ్యులను కలుపుతే సుమారు 40 మిలియన్స్ ఓట్లు భాజపా పార్టీ విజయానికి దోహదపడ్డాయి అని,భారత దేశ ఆర్ధిక పటిష్టతకు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయుల పరోక్షంగా కృషి చేస్తున్నారు కనుక ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు సమకూర్చి సంక్షేమానికి మోడీ ప్రభుత్వం అండగా నిలువాలని విజ్ఞప్తి చేసారు . తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ వలస ప్రభావిత జిల్లాలైన మూడు లోకసభ నియోజకవర్గాల్లో గెలిచిన బీజేపీ నాయకులు బండి సంజయ్ , ధర్మపురి అరవింద్, సోయం బాపు రావు గల్ఫ్ సంక్షేమం అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంక్షేమ చర్యలు భారత ప్రభుత్వం చేపట్టేలా కృషిచేయాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో  ఇండియన్ కాన్సులెట్ దుబాయ్  కార్యాలయం నుండి వైస్ కౌన్సిల్  విభాకాంత్ శర్మ, ETCA ఫౌండర్ పీచర కిరణ్ కుమార్, GTWCA అధ్యక్షులు జువ్వాడి శ్రీనివాస్ రావు,  యూఏఈ తెలంగాణ జాగృతి  ఉపాధ్యక్ష్యురాలు దీపిక,  శ్రీకరం నిర్వహకులు రవి కుమార్ కొమర్రాజు, లీగల్ కన్సల్టెంట్ శాలెం బాబు, మా గల్ఫ్ నిర్వాహకులు శ్రీకాంత్ చిత్తర్వు,  ETCA వైస్ ప్రెసిడెంట్ అరవింద్ బాబు రాగం, జనరల్ సెక్రటరీ నరేశ్ కుమార్ మాన్యం, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , రవి కటుకం, జేడి సుమన్, నర్సింహా, నిర్వాహక కమిటీ సభ్యులు సురేందర్ రావు, భరద్వాజ్, నరేష్ వుత్తూరి, వినోద్ ఆచార్య, రమణ చారి, జలంధర్ రెడ్డి, జగదీష్ రావు, రిషిత, సరోజ , దీపిక, స్పందన, రాణి, వనజ తదితరులు పాల్గొన్నారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com