ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ద్వాదశాదిత్య మహాగణపతిగా..

- June 26, 2019 , by Maagulf
ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ద్వాదశాదిత్య మహాగణపతిగా..

దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రత్యేకం.. ప్రతి ఏటా ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకునే ఈ వినాయకుడు ఈసారి ద్వాదశాదిత్య మహాగణపతి పేరుతో ప్రతిష్టితమవుతున్నాడు.. విగ్రహానికి సంబంధించిన నమూనాను ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సుదర్శన్‌, శిల్పి రాజేందర్‌ ఆవిష్కరించారు. శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతికి కుడివైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సమేత దుర్గా దేవి దర్శనమివ్వనున్నారు.

మహాగణపతి విగ్రహం ముఖ భాగం సూర్యుడిని పోలి ఉంటుంది. విగ్రహానికి 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలు, 7 గుర్రాలు ఉంటాయి. విఘ్నేశ్వరుడికి కుడి, ఎడమ భాగాల్లో సిద్ధ కుంజిగాదేవి, దత్తాత్రేయ విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విగ్రహాలన్నీ 16 అడుగుల పొడవుతో నిర్మించనున్నారు.. అటు మహాగణపతి విగ్రహం కోసం ఇప్పటికే 65 అడుగుల ఎత్తున షెడ్డు నిర్మాణం పూర్తిచేశారు. విగ్రహాన్ని రూపొందించేపనిలో కళాకారులు నిమగ్నమయ్యారు. విగ్రహం తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది కళాకారులు రాత్రుంబవళ్లు శ్రమిస్తున్నారు.

సూర్యుడి అవతారంలో వినాయకుడి ప్రతిష్ట ద్వారా లోక రక్షణ జరుగుతుందని పండితులు చెబుతున్నారు.. సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు.. సిద్ధాంతుల సూచనల ప్రకారమే ఈసారి సూర్యుడి ముఖాన్ని పోలిన విధంగా మహాగణపతిని రూపకల్పన చేస్తున్నామని శిల్పి రాజేందర్‌ తెలిపారు. అటు ఈ ఏడాది సెప్టెంబరు రెండున వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి.. చవితి రోజు గవర్నర్‌ దంపతులు ఖైరతాబాద్‌ వినాయకుడికి తొలి పూజ నిర్వహిస్తారు.. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com