పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి
- January 08, 2016
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్‌లో భారతదేశానికి మద్దతు పెరుగుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, అమెరికా మరింత సహకరించుకోవాల్సిన సమయం ఇదేనని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు చెప్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న వైఖరిని యూఎస్ కాంగ్రెస్‌లోని భారతదేశ వ్యవహారాలపై చర్చించే గ్రూపు గట్టిగా సమర్థిస్తోంది. అమెరికా నుంచి ఆర్థిక సాయాన్ని పొందే అర్హత పాకిస్థాన్‌కు లభించాలంటే భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పాకిస్థాన్ రుజువు చేసుకోవాల్సి ఉంటుందని అమెరికన్ కాంగ్రెస్ కోరుతోంది. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్, రిపబ్లికన్ ఎడ్ రాయ్‌స్ ఓ ట్వీట్‌లో ''ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా, భారతదేశం తప్పనిసరిగా కలిసి పనిచేయాలనడానికి మరో కారణం భారతదేశ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి'' అని పేర్కొన్నారు. హౌస్ డెమొక్రాటిక్ విప్ స్టెనీ హోయర్ తన ట్వీట్‌లో పఠాన్ కోట్ దాడుల బాధితులకు, వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశానికి అమెరికా మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు, హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ఇలియట్ ఎంగెల్ కూడా ఇదేవిధంగా ప్రకటించారు. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు, హౌస్ రూల్స్ కమిటీ చైర్మన్ పీట్ సెషన్స్ ఓ ప్రకటనలో పఠాన్ కోట్, ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపై దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమెరికన్ కాంగ్రెస్‌లో భారతదేశ వ్యవహారాలపై చర్చించే కమిటీకి సహ చైర్మన్లు అమి బెరా, జార్జి హోల్డింగ్స్ ఓ ప్రకటనలో భారత ప్రజలకు, ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఉభయ దేశాలకు సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొనేందుకు భారతదేశానికి అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. యార్క్‌కు చెందిన డెమొక్రాట్ గ్రేస్ మెంగ్ కూడా ఉగ్రవాద దాడులను ఖండించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







