అమెరికా - చైనా : ట్రేడ్ వార్ తారాస్థాయి కి చేరుకుంది

అమెరికా - చైనా : ట్రేడ్ వార్ తారాస్థాయి కి చేరుకుంది

న్యూయార్క్ : చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా చైనా వస్తువులపై మరో 5శాతం ట్రంప్ సర్కార్ విధించడంతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. అమెరికా కంపెనీలు తమ దేశాన్ని వీడాల్సిందిగా డ్రాగన్ కంట్రీ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అమెరికాలో చైనావస్తువులపై మరో 5శాతం అధికంగా సుంకం విధించారు ట్రంప్. అక్టోబర్ 1 నుంచి అమెరికాలో చైనా వస్తువులపై ఇప్పుడున్న సుంకానికి అధికంగా మరో 5శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చైనా వస్తువులపై 25శాతం సుంకం ఉండగా అక్టోబర్ 1నుంచి అది 30శాతానికి పెరగనుంది.

ఇదిలా ఉంటే అమెరికా చైనాల మధ్య వాణిజ్యయుద్ధాన్ని భారత్ అత్యంత దగ్గరగా సమీక్షిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై చైనాతో పాటుగా భారత్ కూడా వ్యతిరేకిస్తున్న క్రమంలో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని భారత్ మానిటర్ చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై సుంకం విధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. దీంతో అద 215 మిలియన్ డాలర్లకు సుంకం విధింపు చేరింది. ఇక అమెరికాలో అప్పటి వరకు భారత ఉత్పత్తులకు దిగుమతి సుంకం లేదు. కానీ ఒక్కసారిగా అమెరికా భారత్‌ ఉత్పత్తులపై సుంకం విధించింది.

ఇక జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు ట్రంప్ ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళతారనగా చైనా వస్తువులపై ఈ సుంకంను విధించారు. చైనా వస్తువులు తమకు అక్కర్లేదని చాలా ఘాటుగా ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు చైనా లేకుంటేనే తమ వాణిజ్యం బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని అమెరికా సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. చైనాలో ఉన్న కంపెనీలను తిరిగి అమెరికాకు తీసుకురావాలని, అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని ట్రంప్ కంపెనీలకు సూచించారు. అయితే కంపెనీలు ఏ దేశం నుంచి కార్యకలాపాలు నిర్వహించాలో అనేదాన్ని ట్రంప్ నిర్ణయించలేరని అది పూర్తిగా ఆయా కంపెనీ యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Back to Top