కాశ్మీర్ పై చర్చలు కుదరవన్న పాక్ విదేశాంగ మంత్రి...మధ్యవర్తిత్వం కోసం వెంపర్లాట

- September 12, 2019 , by Maagulf
కాశ్మీర్ పై చర్చలు కుదరవన్న పాక్ విదేశాంగ మంత్రి...మధ్యవర్తిత్వం కోసం వెంపర్లాట

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని పాకిస్థాన్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీలుచిక్కినప్పుడల్లా దీనిపై ఏదో ఒక చోట మాట్లాడుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యం కావని, మధ్యవర్తిత్వం కావాలని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్‌ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్సీ) 42వ సదస్సు వేదికగా పాక్‌ ఆరోపణలను భారత్‌ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయితే, రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, చర్చల ద్వారా అవి పరిష్కారమవుతాయని ఐరాస పేర్కొంది. ఆ వ్యాఖ్యలను పాక్‌ మంత్రి ఉటంకిస్తూ చర్చల వల్ల ఫలితమేమీ ఉండదన్నారు.

'భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు, చర్చలు సాధ్యం కాని పని. ఇరు దేశాల ఉద్రిక్తతలు మధ్య వర్తిత్వం ద్వారానే అది పరిష్కారమవుతాయి' అని ఖురేషీ అన్నారు. భారత్‌ మాత్రం ఈ విషయంలో ఎప్పటి నుంచో స్పష్టతతో ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా కశ్మీర్‌ అంశాన్ని భారత్‌ అంతర్గత వ్యవహారంగానే పరిగణిస్తోంది. పాక్‌ మాత్రం మూడో వ్యక్తి ప్రమేయాన్ని కోరుతోంది.

ఇటీవల జరిగిన యూఎన్‌హెచ్‌ఆర్సీ సదస్సులో పాక్‌ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. కశ్మీర్‌ పరిస్థితులపై ఈ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలన్న పాక్‌ డిమాండ్‌ను భారత్‌ తోసిపుచ్చింది. ఇది భారత్‌ అంతర్గత వ్యవహారమని, ఇతరుల జోక్యాన్ని ఆమోదించబోమని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com