హలో.. హలో : విక్రమ్ ల్యాండర్ కోసం రంగంలోకి దిగిన నాసా

- September 12, 2019 , by Maagulf
హలో.. హలో : విక్రమ్ ల్యాండర్ కోసం రంగంలోకి దిగిన నాసా

చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్స్ పునురుద్ధరణకు భారత అంతరిక్ష పరిశోధన (ఇస్రో) శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా లాభం లేకుండా పోయింది. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా రంగంలోకి దిగింది. విక్రమ్ ల్యాండర్ సిగ్నల్ ను గుర్తించేందుకు నాసా సైంటిస్టులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హలో హలో అంటూ డీప్ స్పేస్ యాంటెన్నాల ద్వారా చంద్రుడి మీదికి ఏకధాటిగా సంకేతాలను పంపుతున్నారు. అమెరికాకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు స్కాట్ టిల్లే ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. స్పెయిన్ లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని క్యాన్ బెర్రా, కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ ప్రాంతాల్లో నాసాకు డీప్ స్పేస్ స్టేషన్ యాంటెన్నాలు ఉన్నాయి. వాటి ద్వారా హలో అనే సంకేతాలను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇస్రో కంటే బలమైన, అత్యాధునికమైన సంకేతాలను చంద్రుడి మీదికి పంపిస్తున్నట్లు స్కాట్ టిల్లీ తెలిపారు. డీఎస్ఎన్ 24 బీమ్స్ 12 కిలోవాట్ల శక్తిమంతమైన సంకేతాలను పంపిస్తున్నామని వివరించారు. తాము పంపిన సిగ్నల్స్ చంద్రుడిని చేరి.. మళ్లీ భూమికి అందుతున్నాయని, దీనితో ఓ సర్క్యూట్ పూర్తి అయినట్టు భావిస్తున్నామని అన్నారు. నాసా పంపిస్తున్న సంకేతాలు శక్తిమంతమైనవి కావడం వల్ల త్వరలోనే వాటిని విక్రమ్ ల్యాండర్ గ్రహించే అవకాశాలు ఉన్నాయని స్కాట్ టిల్లీ అభిప్రాయపడ్డారు.

చంద్రయాన్-2 ప్రాజెక్ట్ ని ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. చంద్రమామ పైకి విక్రమ్ ల్యాండర్ ని పంపింది. అంతా సజావుగానే సాగింది. కాసేపట్లో విక్రమ్ ల్యాండర్ దిగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో చుక్కెదురైంది. విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ఆచూకీ గల్లంతైంది. 36 గంటల చంద్రుడి ఉపరితలం మీద విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ నిర్దారించారు. అప్పటి నుంచి ల్యాండర్ తో అనుసంధానం కావడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిరంతరాయంగా సంకేతాలను పంపించినప్పటికీ.. ల్యాండర్ వాటిని గ్రహించడం లేదు. తాజాగా నాసా శాస్త్రవేత్తలు కూడా రంగంలోకి దిగారు. ల్యాండర్ జాడ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రుడిపై ప్రయోగానికి నాసా ప్లాన్ చేస్తోంది. 2024లో ప్రయోగం చేయాలని అనుకుంటోంది. ఇందుకోసం మూన్ ని స్టడీ చెయ్యాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విక్రమ్ ల్యాండర్ సిగ్నల్ కోసం రంగంలోకి దిగింది. ఈ స్టడీ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇస్రోకి చెందిన విక్రమ్ ల్యాండర్ కోసం నాసా శాస్త్రవేత్తలు అంత ఇంట్రస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. చంద్రుడిపై ప్రయోగం కోసం నాసా 21.5 బిలియన్ డాలర్ల బడ్జెట్ సిద్ధం చేసింది. అవసరమైతే మరో 1.6 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇస్తామని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. మిషన్ మూన్ ని అమెరికా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com