గోదావరి లో విషాదం...పడవ మునక

గోదావరి లో విషాదం...పడవ మునక

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిలో లాంచీ మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురైందని ఆ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ప్రమాదంలో 11 మంది మరణించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రమాద సమయంలో లాంచీలో మొత్తం 61 మంది ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అందులో 50 మంది పర్యటకులు కాగా 11 మంది బోటు సిబ్బంది. మంటూరుకు చెందిన కొందరు గిరిజనులు చేపలు వేటాడేందుకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగినట్లు గుర్తించి కొందరిని రక్షించారు. ఇప్పటివరకు 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. వారిని రంపచోడవరం, రాజమండ్రి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు దొరికినట్లు తూర్పుగోదావరి ఎస్పీ నయీమ్ అష్మి తెలిపారు.

మాతో వచ్చిన 9 మంది కనిపించడం లేదు: ప్రమాదం నుంచి బయటపడిన వరంగల్ వాసి
వరంగల్ నుంచి తాము 14 మంది వచ్చామని.. బోటు పక్కకు ఒరిగి మునిగిపోయిందని.. చేతికి దొరికిన లైఫ్ జాకెట్లతో బయటపడ్డామని.. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న మరో లాంచీ తమను కాపాడిందని వరంగల్‌కు చెందిన పర్యటకుడు చెప్పారు. తాము మొత్తం 14 మంది రాగా అయిదుగురు ప్రాణాలతో బయటపడ్డామని.. ఇంకా తమ బృందంలోని 9 మంది కనిపించడం లేదని చెప్పారు.

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం
బోటు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రమాద నేపథ్యంలో అధికారులతో ఆయన మరోసారి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు సహాయచర్యలు పర్యవేక్షించాలని సూచించారు.

మారుమూల ప్రాంతం కావడంతో సహాయచర్యలు ఆలస్యం
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించినా అది మారుమూల అటవీ ప్రాంతం కావడంతో, కమ్యూనికేషన్ సదుపాయం సరిగా లేకపోవడంతో సహాయక చర్యలకు సమస్యగా మారిందని అధికార యంత్రాంగం చెబుతోంది. దేవీపట్నం మండల కేంద్రానికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో కచ్చులూరు ఉంటుంది.

గల్లంతైనవారిలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతీయులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. లాంచీ ప్రమాదం నేపధ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కుటుంబసభ్యులు కంట్రోల్ రూమ్ నెంబర్ 180042500002 కి వివరాలు తెలపాలని కలెక్టర్ వినయ్ చంద్ కోరారు. సహాయ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నాయి. ఘటనాస్థలానికి ఏపీ పర్యటక మంత్రి అవంతి శ్రీనివాస్‌ బయలుదేరారు. సహాయక చర్యల కోసం పర్యటక శాఖ బోట్లు బయలుదేరాయి.

ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వెంటనే అధికారులతో మాట్లాడారు సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. సహాయ చర్యల వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు. తక్షణమే బోటు సర్వీసులన్నీ నిలిపివేయాలని ఆదేశించారు. ప్రమాదానికి గురైన లాంచీకి పర్యాటక శాఖ అనుమతులు లేవని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతున్నట్లు చెప్పారు. సహాయచర్యల కోసం 60 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపించినట్లు విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు. 

గోదావరిలో పడవ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు వెంటనే సహాయచర్యలు చేపట్టాలని, గాలింపు వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఘటనపై విచారం వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలోని జనసైనికులు వెంటనే సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

Back to Top