లారీ కంటైనర్‌లో 39 మృతదేహాలు.. 25 ఏళ్ల లారీ డ్రైవర్ అరెస్ట్
- October 23, 2019
లండన్ నగరంలోని ఎస్సెక్స్ కౌంటీలోని గ్రేస్ ప్రాంతంలో ఒక లారీ కంటైనర్‌లో 39 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం, అర్థరాత్రి 1.40 గంటలకు ఈస్ట్రన్ అవెన్యూలోని వాటర్‌గ్లాడ్ పారిశ్రామిక పార్కులో ఈ కంటైనర్‌ను అంబులెన్స్ సర్వీస్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల నార్తరన్ ఐర్లండ్‌కు చెందిన వ్యక్తే ఈ హత్యలు చేసి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ఈ లారీ బల్గేరియా నుంచి వేల్స్‌లోని హోలీహెడ్, ఆంగ్లెసీ పట్టణాల గుండా బ్రిటన్‌లోకి శనివారం ప్రవేశించిందని ఎస్సెక్స్ పోలీసులు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల్లో 38 మంది పెద్దవాళ్లు, ఒక టీనేజర్ ఉన్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.
బాధితులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే దీనికి చాలాకాలం పట్టొచ్చని సూపరింటెండెంట్ ఆండ్రూ మరినెర్ తెలిపారు. ''ఈ సంఘటనకు సంబంధించి లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం అతను పోలీసు కస్టడీలో ఉన్నారు. మా విచారణ కొనసాగుతోంది'' అని ఆండ్రూ వివరించారు. ఈ సంఘటనతో ఆందోళన చెందినట్లు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ''నాకు రెగ్యులర్ అప్డేట్లు వస్తున్నాయి. ఎస్సెక్స్ పోలీసులతో కలసి హోం శాఖ కార్యాలయం పనిచేస్తుంది.. ఏం జరిగిందో తేలుస్తాం. చనిపోయిన వారు, వారి కుటుంబ సభ్యుల గురించే నేను ఆలోచిస్తున్నాను'' అని ప్రధాన మంత్రి వెల్లడించారు.
'ఈ దుర్ఘటనతో షాక్‌కు గురయ్యాను. బాధపడ్డాను'' అని హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ తెలిపారు. 'ఇదొక విచారకరమైన వార్త' అని తుర్రాక్ ఎంపీ జాకీ డొయ్లీ-ప్రైస్ తెలిపారు. ''ప్రజల అక్రమ రవాణా కిరాతకమైన, ప్రమాదకరమైన వ్యాపారం'' అని ఆమె ట్వీట్ చేశారు. ఈ హత్యలు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా ఎస్సెక్స్ పోలీసులు చూడాలని ఆమె కోరారు.
నార్తరన్ ఐర్లాండ్ సరకు రవాణా అసోసియేషన్ పాలసీ మేనేజర్ సీమస్ లెహెనీ స్పందిస్తూ.. ఈ లారీ కనుక బల్గేరియా నుంచి హోలీహెడ్ గుండా బ్రిటన్‌లోకి ప్రయాణిస్తే.. ఇదొక 'అసాధారణ మార్గం' అని అన్నారు. ''(ఇంగ్లండ్‌లోని) డోవర్, (ఫ్రాన్స్‌లోని) కలైస్ వంటి ప్రాంతాల్లో భద్రత, తనిఖీలు పెరిగాయని అంతా అంటున్నారు. కాబట్టి, (ఫ్రాన్స్‌లోని) చెర్‌బర్గ్ లేదా రాస్కఫ్ల నుంచి (ఐర్లండ్‌లోని) రస్లర్ మీదుగా ప్రయాణించి, ఆ తర్వాత డబ్లిన్ వరకూ రోడ్డు మార్గంలో రావడం సులభమైన మార్గంగా కనిపిస్తుండవచ్చు'' అని సీమస్ తెలిపారు. ''ఇది చాలా సుదీర్ఘమైన మార్గం. చుట్టూ తిరిగి రావాలి. ప్రయాణానికి ఒకరోజు ఎక్కువ పడుతుంది.''
ఈస్ట్రన్ అవెన్యూలోని తమ ప్రాంతాలకు సిబ్బంది వెళ్లలేకపోతున్నారని జీఎస్ఎఫ్ కార్ విడిభాగాల సంస్థకు చెందిన గ్లెన్ ఫ్రీలాండ్ చెప్పారు. దీనికి సమీపంలోనే ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి. ''ఈరోజు ఉదయం పనిచేసేందుకు మేనేజర్ వెళ్లారు. కానీ, ఆ ప్రాంతం మొత్తాన్ని కట్టుదిట్టం చేశారు. మమ్మల్ని వేరే ప్రాంతానికి తరలించారు'' అని ఫ్రీలాండ్ చెప్పారు. 2000వ సంవత్సరం జూన్ నెలలో డోవర్ పట్టణంలో ఒక లారీ వెనుక భాగంలో 58 మంది చైనా వలసదారులు ఊపిరాడక మృతి చెందారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఊచకోత కోశారనే నేరంపై ఒక డచ్ లారీ డ్రైవర్‌ను ఆ తర్వాతి సంవత్సరం జైలుకు పంపించారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







