పర్యటనలో చాలా విషయాలు అర్థమయ్యాయి: ఈయూ బృందం

- October 30, 2019 , by Maagulf
పర్యటనలో చాలా విషయాలు అర్థమయ్యాయి: ఈయూ బృందం

శ్రీనగర్‌: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని.. కశ్మీర్‌లో పరిస్థితుల్ని పరిశీలించడానికి మాత్రమే ఇక్కడ పర్యిటించామని ఐరోపా సమాఖ్య(ఈయూ) పార్లమెంటు సభ్యులు తెలిపారు. ఈ పర్యటనలో తమకు చాలా విషయాలు అర్థమయ్యాయని వ్యాఖ్యానించారు. ఐదుగురు అమాయక వలస కూలీలను మంగళవారం ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పర్యటన విశేషాలను బుధవారం వారు విలేకరులతో పంచుకున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి పౌర సమాజ ప్రతినిధులతో మాట్లాడామన్నారు. పాఠశాలు, మొబైల్‌ సేవల పునఃప్రారంభం లాంటి పలు అంశాల్ని చర్చించామన్నారు. ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరులో ఐరోపా సమాఖ్య ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. కశ్మీర్‌ అంశం పూర్తిగా అంతర్గత అంశం అయినందున దీనిపై ఐరోపా సమాఖ్యకు ఎలాంటి నివేదిక సమర్పించబోమని స్పష్టం చేశారు. భారత్‌-పాక్‌ మధ్య సామరస్యపూర్వక చర్చలు జరగాల్సి ఉందని.. దీనికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

మేం 'నాజీ లవర్స్‌' కాదు...
కశ్మీర్‌ పరిస్థితులపై వాస్తవాలు, సమాచారం తెలుసుకునేందుకు వచ్చిన తమని 'నాజీ లవర్స్‌' అని పిలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మేం నాజీ లవర్స్‌ కాదు. ఒకవేళ అదే నిజమైతే మేం ఎన్నికయ్యే వాళ్లమే కాదు'' అని ఘాటుగా స్పందించారు. ఈయూ ప్రతినిధుల బృందం పర్యటనపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ 'నాజీ సిద్ధాంతాల్ని విశ్వసిస్తూ, తమని తాము నియంతలమని చెప్పుకునే ఈయూ ఎంపీల బృందాన్ని భారత ప్రభుత్వం కశ్మీర్‌కి అనుమతిస్తోంది' అని వ్యాఖ్యానించిన విషయం తెలిసందే. తాజాగా ఓవైసీ వ్యాఖ్యలపై ఈయూ బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

జమ్మూ-కశ్మీర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించడానికి ఐరోపా సమాఖ్య పార్లమెంట్‌ సభ్యుల బృందం మంగళవారం శ్రీనగర్‌ చేరుకున్న విషయం తెలిసిందే. అధికరణ 370రద్దు తర్వాత ఓ విదేశీ బృందం కశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటన నిమిత్తం మొత్తం 27మంది దిల్లీ చేరుకోగా.. నలుగురు మాత్రం అక్కడి నుంచే తిరుగుపయనయ్యారు. దీంతో 23 మంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. అయితే వీరి రాకకు నిరసనగా లోయలో బంద్‌ పాటించగా.. అక్కడక్కడ స్వల్ప స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ విదేశీ బృందం పర్యటనపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. విదేశీ ప్రతినిధుల్ని అనుమతిస్తున్న కేంద్రం.. ప్రతిపక్ష నాయకుల్ని ఎందుకు అడ్డుకుంటుందని కాంగ్రెస్ ప్రశ్నించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com