తెలంగాణ:ఆర్టీసీ సమ్మె విరమణ

- November 25, 2019 , by Maagulf
తెలంగాణ:ఆర్టీసీ సమ్మె విరమణ

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు. విధి లేని పరిస్థితిలో సమ్మెను విరమిస్తున్నామని, రేపటి నుంచి విధులకు హాజరవుతామని తెలిపారు. సమ్మెను కొనసాగిస్తామని నిన్న చెప్పిన నేతలు నేడు మాట మార్చేశారు. బేషరతుగా విధుల్లోకి చేర్చుకోవాలన్న డిమాండుపై సీఎం కేసీఆర్ స్పందించని నేపథ్యంలో తాజా ప్రకటన చేశారు.

'ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.. కార్మికులు రేపు ఉదయం 6 గంటలకు విధుల్తోకి వెళ్లాలి. ఇందుకు వీలుగా ప్రైవేటు ఉద్యోగులు వెళ్లిపోవాలి. సమ్మె కార్మికులకు నైతిక విజయం..' అని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. 'దశల వారీగా పోరాటం కొనసాగుతుంది. విధులు నిర్వహిస్తూ మా డిమాండ్ల సాధన కోసం పోరాడతాం. ఆర్టీసీని కాపాడుకుంటాం. దేశంలో దొంగలు పడ్డట్టు ఆర్టీసీలో దొంగలు పడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా 52 రోజుల పాటు సమ్మె చేశాం.

నైతిక విజయం మాదే.. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు మాకు సహకరించి రేపు డిపోలకు రాకూడదు.. ' అని కోరారు. తమ పోరాటం ఆగదని, ఆర్టీసీని కాపాడుకోడానికి ప్రజలతో కలసి కమిటీని వేస్తామని జేఏసీ మరో నేత రాజిరెడ్డి చెప్పారు.

సీఎం కేసీఆర్.. ఈ రోజు గవర్నర్ తమిళిసైను కలిసిన నేపథ్యంలో జేఏసీ నిర్ణయం వెలువడడం గమనార్హం. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండులో కార్మికులు 50 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం స్పందించకపోవడం, హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వకుండా కార్మిక కోర్టులోకి బంతిని నెట్టేయడంతో కార్మికులు సమ్మెకు స్వస్తి పలికారు. జేఏసీ నిర్ణయంపై ప్రభుత్వం కాసేపట్లో స్పందించే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com