పౌరసత్వ సవరణ బిల్లును ఖండించిన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

- December 10, 2019 , by Maagulf
పౌరసత్వ సవరణ బిల్లును ఖండించిన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌: పౌరసత్వ సవరణ బిల్లుకు భారత లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్‌ ఉల్లంఘించిందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుతో పాకిస్తాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్‌ తూట్లు పొడిచిందని విమర్శించారు. అదే విధంగా బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను సైతం ఇమ్రాన్‌ తప్పుబట్టారు. హిందూ రాష్ట్ర భావనను విస్తరించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందంటూ ఆరెస్సెస్‌ వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వాడి, వేడి చర్చల మధ్య స్పీకర్‌ ఓం బిర్లా ఓటింగ్‌ చేపట్టగా బిల్లుకు అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లైంది. ( పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం )

ఇక ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్‌ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విపక్ష విమర్శలను తిప్పికొట్టారు. 'రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే ఈ బిల్లు ఉంది. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్‌ 14 సహా రాజ్యాంగంలోని ఏ అధికరణకు కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదు' అని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఈ బిల్లుతో ఏ విధమైన సంబంధం లేదని, ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్‌ షా హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com