మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో చోరీ!

- December 29, 2019 , by Maagulf
మూవీ మొఘల్ డాక్టర్  దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో చోరీ!

దివంగత నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్  దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా కారంచేడు చిన వంతెన‌ సమీపంలోని ఆయన స్వగృహంలో ఈ దొంగతనం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలు పగలగొట్టి భారీగా నగదు, వెండిని దోచుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆ ఇంట్లో దగ్గుబాటి రామ్మోహన్ రావు దంపతులు నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉండటంతో తరచూ వెళ్లి వస్తున్నారు. ఇదే క్రమంలో డిసెంబర్ 16న రామ్మోహన్ రావు దంపతులు హైదరాబాద్‌కు వచ్చారు. ఇక అదే అదనుగా చేసుకుని దొంగలు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. సుమారు మూడు సవర్ల బంగారంతో పాటుగా 10 కిలోల వెండి, 60 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.

శనివారం నాడు ఉదయం ఇంటి పనులు చేసేందుకు వచ్చిన నరసింహారావు దంపతులు.. ఇంటి తాళాలు బద్దలైపోవడం గమనించి ఆఫీస్ మేనేజర్ తాళ్లూరి శ్రీనివాసరావుకు విషయాన్ని చేరవేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. కాగా, పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న రామ్మోహన్ రావుకు జరిగిన విషయాన్ని తెలియజేయగా.. సొత్తు ఎంత పోయిందనే పూర్తి వివరాలు వారు వచ్చాక తెలుస్తాయని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com