బ్రిటన్ రాయబారిని అరెస్ట్ చేసిన ఇరాన్..భగ్గుమంటున్న పరిస్థితులు

- January 13, 2020 , by Maagulf
బ్రిటన్ రాయబారిని అరెస్ట్ చేసిన ఇరాన్..భగ్గుమంటున్న పరిస్థితులు

అణ్వాయుధాల తయారీ టెన్షన్ అలా ఉంటే...మరోవైపు ఉక్రెయిన్ ఫ్లైట్ కూల్చివేత ఘటనే ఇరాన్‌ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. పొరపాటున కూల్చేశాం అని చెప్తున్నా..ఇరాన్ తప్పిదంపై బ్రిటన్ సహా అనేక దేశాలు భగ్గుమంటున్నాయి. చేసిన తప్పిదానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఉక్రెయిన్, బ్రిటన్ డిమాండ్ చేశాయి. ఈ సమయంలోనే ఇరాన్ ఏకంగా బ్రిటన్ రాయబారిని అరెస్ట్ చేసింది.. దీంతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఏర్పడింది.

ఇరాన్ ప్రపంచదేశాల్లో ఒంటరి కాబోతోందా...ఎందుకంటే ఇప్పటికే అమెరికా విధించిన ఆంక్షలకు బ్రిటన్ కూడా తోడవతున్న సంకేతాలు వస్తున్నాయి. ఇరాన్ చర్యని నిరసిస్తూ..బ్రిటిష్ పౌరులు, ఉక్రెయిన్ పౌరులు టెహ్రాన్‌లో నిరసనకు దిగారు. ఇందులో బ్రిటన్ దేశపు రాయబారి మెక్ కెయిర్ కూడా పాల్గొన్నారు. ఆయన్ని ఇరాన్ అరెస్ట్ చేయడంతో పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి.

మెక్ కెయిర్‌ను ఇరాన్ తాత్కాలికంగానే అరెస్ట్ చేసినట్లు చెప్తున్నా...బ్రిటన్ మాత్రం సీరియస్‌గా తీసుకుంది. అసలు దౌత్యప్రతినిధిని అరెస్ట్ చేయడమేంటని మండిపడుతోంది. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు నిదర్శనమంటూ బ్రిటన్ ఆరోపించింది. దీంతో అమెరికా తర్వాత మరో అగ్రరాజ్యం ఇరాన్‌కి వ్యతిరేకంగా మారినట్లైంది.

అమెరికా - ఇరాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఉక్రెయిన్ ఫ్లైట్‌ని మిస్సైల్‌ అనుకుని ఇరాన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. 176 మంది ప్రయాణికులు, సిబ్బందితో టెహ్రాన్ నుంచి రీవ్‌కు ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇరాన్ వైమానిక దళం దానిపై రెండు క్షిపణులతో దాడి చేసింది. అమెరికా, ఉక్రెయిన్, బ్రిటన్..తదితర దేశాలు దీన్ని సాక్ష్యాధారాలతో సహా నిర్ధారించాయి. ముందు కాదన్నా ఇరాన్ తన తప్పు ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత వ్యవహరిస్తున్న వైఖరి మాత్రం ఆ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com