హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న కరోనా వైరస్
- January 28, 2020
కరోనా వైరస్ హైదరాబాద్‌ను వణికిస్తోంది. చైనాలో చిన్నగా ప్రారంభమైన కరోనా భయం.. ఇప్పుడు భారత్‌ను వెంటాడుతోంది. ముఖ్యంగా హైదరబాద్‌లో అనుమానాలు పెంచుతోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో వచ్చి ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు అనుమానిత కేసులతో హైదరాబాద్ ఉలిక్కి పడింది. అయితే, ఆ నలుగురిలో ఇద్దరి రక్తనమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది.
మరోవైపు ఈ ప్రమాదకరమైన కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధి గ్రస్తులను గుర్తించకపోయినా.. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే.. వెంటనే చికిత్స చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యంగా గాంధీ, చెస్ట్ ఆసుపత్రుల్లో ఒక్కోదాంట్లో 8 పడకల చొప్పున వెంటిలేటర్లు, ఇతర అధునాతన పరికరాలతో కూడిన ఐసీయూలను అందుబాటులో ఉంచారు.
కరోనా వైరస్ బాధితుల చికిత్స, నమూనాల సేకరణ, పుణెకు పంపించడం, ఫలితాలు ఎప్పటికప్పుడూ తెలుసుకోవడం, అవసరమైన ఇతర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కూడా వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వైద్య ఉన్నతాధికారులతో సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్స ఏర్పాట్లను సమీక్షించేందుకు ఇప్పటికే కేంద్ర బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆ బృందం మంగళవారం రాష్ట్ర వైద్యాధికారులతో భేటీ కానుంది.
చైనా, హాంకాంగ్ తదితర దేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే.. కరోనా వైరస్ వచ్చిందనే భయంతో ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. సాధారణ ఫ్లూ లక్షణాలుంటే.. వారిలో కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ లక్షణాలు కావచ్చేమోననే అనుమానిస్తే మాత్రం వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాలని కేంద్ర అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







