CAA అలజడి..34కు చేరిన మృతుల సంఖ్య

- February 27, 2020 , by Maagulf
CAA అలజడి..34కు చేరిన మృతుల సంఖ్య

దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అల్లర్లు అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తున్నా మృతుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక నిరసనలతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 34 మంది మృతి చెందారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో భారీ స్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది.

మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో పరిస్థితులను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. నిన్న ఉద్రిక్తత కొంత తగ్గినా ఇంటెలిజెన్స్ అధికారి అంకిత్ శర్మ మురుగు కాలువలో శవమై తేలారు. ఆందోళనకారులు అంకిత్ శర్మను తీసుకెళ్లడం తాము చూసినట్టు కొంతమంది చెబుతున్నారు.

ఘర్షణల్లో పలువురు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు (ఎన్ఐఏ) ఢిల్లీ అల్లర్ల బాధ్యతలను అప్పగించింది. ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు చేస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించారు. దోవల్ స్థానికులతో మాట్లాడి వారిలో సందేహాలను తొలగించే ప్రయత్నం చేశారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిన్న కర్వాల్ నగర్, శివ్ విహార్ ప్రాంతాల్లో పర్యటించారు. కేంద్రం ఢిల్లీలో అదనపు బలగాలను మోహరించింది. ఢిల్లీ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. రాళ్ల దాడులు, బుల్లెట్ గాయాలతో 183 మంది ఆస్పత్రిలో చేరగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పోలీసులు హింసకు బాధ్యులైన 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం గుజరాత్ అల్లర్లను ప్రస్తుత పరిణామాలు గుర్తు చేస్తున్నాయని వ్యాఖ్యలు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com