దేశాధినేతలనూ వణికిస్తున్న వైరస్..బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటీవ్

- March 27, 2020 , by Maagulf
దేశాధినేతలనూ వణికిస్తున్న వైరస్..బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటీవ్

యూరప్ దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. జనం ఒక్క రోజులోనే వేలల్లో పిట్టల్లా రాలిపోతున్నారు. చివరికి దేశాధినేతలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. బ్రిటన్ రాజకుటుంబాన్ని వైరస్ బాధితుల్లో చేరిపోయారు. ఇక ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని బోరిస్ జాన్సన్ ట్విట్టర్ లో వీడియో ద్వారా స్వయంగా వెల్లడించారు. నిన్న స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించటంతో ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి వ్యక్తిగత సలహా మేరకు పరీక్షలు చేయించుకున్నానని, పాజిటీవ్ రావటంతో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయినా..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తానని భరోసా ఇచ్చారు. వైరస్ పై సమిష్టిగా పోరాడాల్సిందిగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.  

ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇటలీ, ఆమెరికా తర్వాత బ్రిటన్ దేశం పెను మూల్యం చెల్లించుకునే ప్రమాదంలో ఉంది. ఇప్పటివరకు బ్రిటన్‌లో 11,658 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా, ఈ కరోనా వల్ల 578 మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాధినేతనే కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దీనికితోడు బోరిస్ ఈ రోజు ఉదయం కరోనా వైరస్ వ్యాప్తిపై చాన్సలర్, ఆరోగ్య కార్యదర్శితో పాటు తన ఆఫీస్ స్టాఫ్ తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీంతో సమావేశానికి హజరైనవారు కూడా నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు..బోరిస్ కేబినెట్ లో మంత్రులు కూడా వైరస్ బారిన పడే ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆందోళన కలిగించే అంశం. అయితే..ప్రధాని బోరిస్ నిర్బంధ సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే తాత్కాలిక ప్రధానిగా డొమినిక్ రాబ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com