తెలంగాణ:ఫేక్ న్యూస్‌పై యుద్దం..

- April 02, 2020 , by Maagulf
తెలంగాణ:ఫేక్ న్యూస్‌పై యుద్దం..

కరోనా వైరస్ కంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి ఎక్కువైపోయింది. ఒక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకోవడం.. సీఎం,పీఎంల ప్రెస్‌మీట్లకు వక్రభాష్యం చెప్పడం.. కరోనాకు ఇదే మందు అని ఊదరగొట్టడం.. లేనిపోని అపోహలు,కల్పితాలు,సొంత పైత్యం అంతా నూరిపోసి సోషల్ మీడియాలోకి ఎక్కించడం జరుగుతోంది. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక అమాయక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది.

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఫేక్ న్యూస్ అన్నింటిని ఒక్కచోటకు చేర్చి.. వాటిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇచ్చేలా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. https://factcheck.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో ఫేక్ న్యూస్‌పై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ&కమ్యూనికేషన్(ITE&C),ఫ్యాక్ట్లీ మీడియా&రీసెర్చ్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. ప్రత్యేకించి కరోనా వైరస్‌పై ఫేక్ న్యూస్ సమాచారం అందించేందుకే ఈ వెబ్ సైట్ పనిచేస్తుంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆర్టికల్స్ లేదా సమాచారంపై ఎలాంటి సందేహం ఉన్నా సరే.. వాటిని ఈ సైట్‌కి పంపించవచ్చు. అక్కడున్న ఫ్యాక్ట్ చెక్ నిపుణులు దాన్ని పరిశీలించి అది నిజమో కాదో సైట్‌లో పొందుపరుస్తారు.

దేశంలో ఫేక్ న్యూస్‌ కట్టడి కోసం ఇలాంటి వెబ్‌సైట్‌ను రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషం. ఇటీవలే ఢిల్లీ నుంచి స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికులపై కూడా పలు ఫేక్ న్యూస్ సర్క్యులేట్ కావడంతో... తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కూడా కేంద్రాన్ని ఆదేశించింది. ఇంతలోనే తెలంగాణ ప్రభుత్వం వెబ్‌సైట్‌ను లాంచ్ చేయడం గమనార్హం. ఇటీవలి ప్రెస్‌మీట్లలో సైతం సీఎం కేసీఆర్ ఫేక్ న్యూస్‌పై హెచ్చరికలు జారీ చేశారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 54 లోని నిబంధనలను మరియు తెలంగాణ ఎపిడెమిక్ డిసీజెస్ (COVID-19) రెగ్యులేషన్స్ 2020ని ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద పొందుపరిచింది. దీని ప్రకారం నిజానిజాలతో సంబంధం లేకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారు శిక్షార్హులు అవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com