రేపటి నుంచి రమదాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

- April 23, 2020 , by Maagulf
రేపటి నుంచి రమదాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

ముస్లింలకు పవిత్రమైన రమదాన్ మాసం రేపటి నుంచి గల్ఫ్ దేశాల్లో ప్రారంభంకానుంది. గురువారం నెలవంక కనిపించడంతో... శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. రమదాన్  మాసం శుక్రవారం ప్రారంభమై... మే నెలలో ముగియనుంది.రేపటి ప్రారంభం కానున్న రమదాన్ ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్‌ ప్రార్థనలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద, గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దులాజీజ్‌ అల్ షేక్ ప్ర‌పంచంలో వున్న ముస్లింల‌కు పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులకు వెళ్లే పరిస్థితులు లేవని ముఫ్తీ గుర్తుచేశారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

రమదాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. ఈ మాసంలో రోజుకు ఐదుసార్లు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మహ్మద్‌ ప్రవక్త హజరత్‌ రసూల్‌ ఇల్లల్లాహి మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది.

రమదాన్ మాసంలో ముస్లింలు తెల్లవారు జామున 4 గంటలకు ఆహారం తీసుకుంటారు. అనంతరం సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఎంగిలి కూడా మింగ కుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో అందరూ ఉపవాస దీక్షలో ఉంటారు. ఈ దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. రమదాన్ మాసంలో ఈ ఉపవాస దీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తాయి. ముస్లింలు తాము సంపాదించిన దానిలో పేదవారికి కనీసం నూటికి రూ.2.50పైసలు, గోధుమలు, సేమియా, వస్త్రాలు, బంగారం దానం చేయాలని ఖురాన్‌ చెబుతోంది. రమదాన్ నెలలో ఇలా దానం చేస్తే పేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు అంటుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com