కోవిడ్ చికిత్స కు అదనంగా రూ.1000 కోట్లు కేటాయించిన జగన్

- July 25, 2020 , by Maagulf
కోవిడ్ చికిత్స కు అదనంగా రూ.1000 కోట్లు కేటాయించిన జగన్

ఏపీలో రోజు రోజుకూ కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేటాయించిన నిధులకు అదనంగా రూ.1000 కోట్లను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

శుక్రవారం కోవిడ్-19 నివారణ చర్యలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, ఖరీదైన మందులను అందుబాటులో ఉంచాలని.. ఇందు కోసం ఒక్కో రోగికి రూ.35 వేలు ఖర్చు అవుతుందని.. అయినా వెనకాడ వద్దని ఆయన అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో కోవిడ్ అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులు, మౌలిక సదుపాయాల పెంపునకు రాబోయే 6 నెలల్లో రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులను పెంచడం ద్వారా మొత్తం బెడ్ల సంఖ్య 39,051కి చేరుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ఆసుపత్రుల్లో 4,300 ఐసీయూ బెడ్స్, 17,380 ఆక్సిజన్ సదుపాయం గల నాన్-ఐసీయూ బెడ్స్, మరో 17,371 నాన్-ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 72,711 బెడ్లు కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నందున.. యాక్టీవ్ కేసులు అందరికీ సేవలు అందుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే 10 ఆసుపత్రులను రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రులుగా మారుస్తున్నట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు.

కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల్లో అత్యవసర మందులను వెంటనే కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని, క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ఔషధాలు 2 లక్షల కేసుల వరకు సరిపోతాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు.

కంటైన్మెంట్, రెడ్ జోన్లలోనే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నందు వల్ల కేసులు ఎక్కువగా వస్తున్నాయని, ప్రజలు అంకెలను చూసి భయపడవద్దని వైఎస్ జగన్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com