పాపాయి

పాపాయి

పాపాయి

చిట్టి చిట్టి పాపాయి చిన్నారీ నేవోయి
చిరుమందహాసాల చిరునామా నీదేను
నినుజూసి మనసంతా హాయిగొలుపు రోజంతా
అసమానపు సిరులన్నీ మూటగట్టి తెచ్చేవు

నీ నవ్వుల పువ్వులకు వెలలేదీలోకంలో
నీ చూపుల అనురాగం నింపేనే మమకారం
నీ ఒలికే రాగాలు సాటిరాని సరికిగమలు
నీ చిలిపి చేష్టలు మరపురాని మధురిమలు

మౌనంగా మాట్లాడీ అందరినీ దరిచేర్చే
చిట్టితల్లి నీవమ్మా చిన్నారీ నీవమ్మా
ఈ సృష్టికి లోకంలో నీవేకదా చిరునామా
ఏమిస్తే నీరుణము తీరుతుంది చెప్పమ్మా

ఈ ఇలలోన వెలలేదు నీవు గొలుపు హాయికి
ముత్యంలాంటి నీ నవ్వే మాకిచ్చే ఆభరణం
కలలన్నీ మావైతే కళల రూపం నీవేలే
తలిదండ్రుల నోములకు ప్రతిరూపం నీవమ్మా

మా ఆశల ప్రతిరూపం నీవేకదా పాపాయి
రాబోయే రోజుల్లో జగమంతా గెలవాలి
ఇదేకదా నీవిచ్చే మా శ్రమలకు ప్రతిఫలము
మా మంచి పాపాయి మము మరచి పోదోయి

--సోమసుందర్ ఎస్.పీ(షార్జా,యూ.ఏ.ఈ)

Back to Top